Begin typing your search above and press return to search.

పిక్ టాక్: పిట్టల రెట్టలతో అధ్వానంగా 'ఉప్పల్' స్టేడియం

By:  Tupaki Desk   |   25 Sep 2022 5:00 AM GMT
పిక్ టాక్: పిట్టల రెట్టలతో అధ్వానంగా ఉప్పల్ స్టేడియం
X
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్.సీఏ) అంటేనే అవినీతితో పంకిలమైపోయిందన్న టాక్ దేశవ్యాప్తంగా ఉంది. అధ్యక్షుడు అజారుద్దీన్ పై, కార్యవర్గ సభ్యులు తిరుగుబాటు చేసి అవినీతి ఆరోపణలు చేయడం.. కొందరు కార్యవర్గ సభ్యుల అవినీతి బయటపడడంతో హైదరాబాద్ క్రికెట్ ప్రభ తగ్గిపోయింది. అందుకే బీసీసీఐ కూడా లైట్ తీసుకుంది. నాలుగేళ్లకు కానీ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి క్రికెట్ మ్యాచ్ నిర్వహించే అవకాశం ఇవ్వలేదంటే మన వాళ్ల సంకుల క్రీడా సమరం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు..

ఇక్కడి తెలంగాణ ప్రభుత్వం కానీ.. అటు బీసీసీఐ పెద్దలు కానీ పట్టించుకోకపోవడంతో ఈ క్రికెట్ సంఘం క్రికెట్ యేతర వ్యవహారాల్లో అభాసుపాలైంది. వర్ధమాన క్రీడాకారులను తీర్చిదిద్దాల్సిన సంఘం అవినీతి ఆరోపణలు అధోగతి పాలైంది.

ఎట్టకేలకు బీసీసీఐ మూడేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చింది. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సీ.ఏ) మాత్రం ఈ విషయంలోనూ కనీసం సదుపాయాలు, ఏర్పాట్లు చేయకుండా ఫెయిల్యూర్ గా నిలిచింది. ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకం నుంచి స్టేడియం లోపల కనీస సౌకర్యాలు కల్పించడం వరకూ అవసరమైన ఏర్పాట్లు చేయడంతో విఫలమై క్రికెట్ అభిమానులను చాలా నిరాశపరిచింది.

గత మూడేళ్లుగా స్టేడియం నిరుపయోగంగా ఉండడంతో సీటింగ్ ఏరియా పూర్తిగా పక్షులకు ఆవాసంగా మారింది. సీట్లు పక్షుల వ్యర్థాలతో గలీజుగా మారాయి. వాటిని శుభ్రం చేయడంలో హెచ్‌సిఎ అధికారులు పట్టించుకోలేదు.

ఉప్పల్ స్టేడియం అక్రమ నిర్మాణం కారణంగా అగ్నిమాపక శాఖ అనుమతిని రద్దు చేయడం మరో షాకింగ్ అంశం. పొగ వస్తే స్టేడియంలో అప్రమత్తం చేసేందుకు స్మోక్ డిటెక్టర్లు, మంటలను ఆటోమేటిక్‌గా ఆర్పేందుకు స్ప్రింక్లర్లు లేవు. అలాగే అగ్ని ప్రమాదం జరిగితే వాటర్ ట్యాంక్ సౌకర్యం లేదు. అగ్నిమాపక శాఖ అనుమతిని రద్దు చేసినా దానిని పునరుద్ధరించేందుకు హెచ్‌సీఏ పట్టించుకోలేదు.

షెడ్యూల్‌కు కనీసం 30 రోజుల ముందే భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌ను బీసీసీఐ ఖరారు చేసింది. కానీ క్రికెట్ అభిమానుల కోసం హెచ్‌సీఏ స్టేడియంను సిద్ధం చేయలేదు. సీటింగ్ సామర్థ్యం భయంకరమైన స్థితిలో ఉంది. ఆ సీటింగ్ ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అవి చూస్తే అసలు కూర్చోవడానికి కూడా ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవు. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసే వేలాది మంది అభిమానులు ఖచ్చితంగా నిరాశ చెందుతారు.

ఇంత అద్వానంగా ఉన్నా కూడా హెచ్‌సిఎ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ మాత్రం స్టేడియంలో సమస్యలను తేలిక కొట్టిపారేశారు. మీడియా అతనిని ప్రశ్నించినా కూడా అతను నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు.

హెచ్.సీఏ వ్యవహారాలు అవినీతికూపంగా మారాయి. ఆరోపణలు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఒక స్వతంత్ర సంస్థ అయినందున బీసీసీఐ కూడా హెచ్.సీఏ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. దీంతో సమస్యలు ఇంకా పెరుగుతున్నాయి. పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఇలా అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దుస్థితి ఎప్పటికీ మారదు.