మావోయిస్టులకు ఇది గట్టి దెబ్బేనా?

Wed Jun 29 2022 08:43:20 GMT+0530 (IST)

Sitaramaraj district Maoist Leader Arrested

ఆంధ్రప్రదేశ్ లో ఏవోబీ (ఆంధ్ర-ఒడిశా సరిహద్దు) అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన మొత్తం 60 మంది సభ్యులు సానుభూతిపరులు తాజాగా పాడేరులో విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్. హరికృష్ణ సమక్షంలో స్వచ్ఛందంగా లొంగిపోయారు.ఒకేరోజు ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టు పార్టీ సభ్యులు సానుభూతిపరులు లొంగిపోవడం ఇదే ప్రథమమని అంటున్నారు. ఈ 60 మందిలో 33 మంది మావోయిస్టులు 27 మంది మిలీషియా సభ్యులు ఉన్నారని సమాచారం. ఇది మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ అని చెబుతున్నారు. అందులోనూ కీలక నేత పెదబయలు-కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి వంతాల రామకృష్ణ అలియాస్ ప్రభాకర్ అలియాస్ అశోక్ అలియాస్ గొడ్డలి రాయుడును పోలీసులు అరెస్టు చేశారు. లొంగిపోయిన వారిలో 33 మంది మావోయిస్టులపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉందని పోలీసులు చెబుతున్నారు. గత ఏడాది 135 మంది మావోయిస్టులు సానుభూతిపరులు లొంగిపోయారని అంటున్నారు.

గిరిజనుల్లో కోందు కులానికి చెందిన వంతాల రామకృష్ణ పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ కోండ్రుం గ్రామానికి చెందినవాడు. మావోయిస్టు పార్టీ నేత భూపతి ప్రోద్బలంతో 2003లో మావోయిస్టు మిలీషియా సభ్యుడిగా చేరాడు. అప్పటి నుంచి దళ సభ్యుడిగా పార్టీ మెంబర్‌గా ఏరియా కమిటీ కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదిగాడని చెబుతున్నారు.

ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి కోరాపుట్టు ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో రామకృష్ణ మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహించేవాడని అంటున్నారు. ఆయనపై 124 కేసులున్నాయని చెబుతున్నారు. ఇందులో 14 హత్యలు 13 ఎదురుకాల్పుల ఘటనలు నాలుగు మందుపాతరలు పేల్చిన సంఘటనలు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినందుకు మరో ఆరు కేసులు ఉన్నాయని పేర్కొంటున్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అరకు లోయ టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమతోపాటు పలువురు గిరిజనుల హత్య కేసుల్లోనూ వంతాల రామకృష్ణ నిందితుడని పోలీసులు చెబుతున్నారు. రామకృష్ణ పేరుపై ప్రభుత్వం రూ.ఐదు లక్షల రివార్డును కూడా ప్రకటించింది. రామకృష్ణ నుంచి రూ.39 లక్షల నగదు ఐదు కిలోల మైన్ ఐదు డిటోనేటర్లు 90 మీటర్ల పొడవు గల కరెంట్ వైరు ఆరు బ్యాటరీలు 9ఎంఎం పిస్టల్ ఎనిమిది 9ఎంఎం రౌండ్లు విప్లవ సాహిత్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు.