Begin typing your search above and press return to search.

రేవంత్ బాటలో అడుగులు వేస్తున్న సిద్ధూ.. ఏం చేస్తున్నారంటే?

By:  Tupaki Desk   |   20 July 2021 12:30 PM GMT
రేవంత్ బాటలో అడుగులు వేస్తున్న సిద్ధూ.. ఏం చేస్తున్నారంటే?
X
ఎక్కడ రేవంత్ రెడ్డి.. ఎక్కడ సిద్ధూ అన్న సందేహం అక్కర్లేదు. రాజకీయాల్లో ఒకరి ఫార్ములా సక్సెస్ అయితే.. అందిపుచ్చుకోవటానికి నేతలు సిద్ధంగా ఉంటారు. అందులోని ఇప్పుడు నడుస్తున్నది డిజిటల్ ప్రపంచం. సమాచారం చాలా వేగంగా వెళ్లిపోతూ ఉంటుంది. పంజాబ్ లో అధికారపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న అమరీందర్ సింగ్ కు.. పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా నియమితుడైన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు అధినాయకత్వం పట్టం కట్టటం తెలిసిందే.

వయసు మీద పడి.. రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అమరీందర్ నుంచి పార్టీని సిద్ధూకు అప్పజెప్పాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావించటం.. అందుకు ససేమిరా అని పంజాబ్ ముఖ్యమంత్రి చెప్పినప్పటికి సోనియమ్మ మాత్రం సిద్ధూకు ఓటేసి.. పట్టం కట్టేశారు. వాస్తవానికి పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చాలానే పోలికలు ఉన్నాయి. రెండు చోట్ల పార్టీలోని నేతలు పని చేయటాని కంటే కూడా పదవులు తీసుకోవటానికే మక్కువ చూపుతారు. ఇలాంటివేళ.. ఫ్యూచర్ టీంను సెట్ చేస్తున్న కాంగ్రెస్.. పంజాబ్ లో పార్టీ భవిష్యత్తును పరిగణలోకి తీసుకొని సిద్ధూ చేతికి పార్టీ పగ్గాలు ఇచ్చేందుకు ఓకే చెప్పేయటం.. అధికారికంగా ప్రకటించటం తెలిసిందే.

రాష్ట్ర పార్టీ చీఫ్ పదవిని ఇవ్వకుంటే వెళ్లిపోతాన్నట్లుగా నారాజ్ అయిన సిద్ధూను కూల్ చేసిన గాంధీ ఫ్యామిలీ.. తామిచ్చిన మాట మీద నిలబడ్డారు. ఎప్పుడైతే పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైనట్లు అధికారిక సమాచారం వెల్లడైందో సిద్ధూ తన పనిని మొదలు పెట్టారు. అచ్చంగా తెలంగాణలో రేవంత్ మాదిరే.. సిద్ధూ సైతం పార్టీ నేతలు.. సీనియర్ల ఇంటికి స్వయంగా వెళ్లి.. పార్టీ కోసం పని చేయాలని అడుగుతున్నారట.

మరికొద్ది నెలల్లో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుున్న వేళలో.. అందరం కలిసి కట్టుగా పని చేస్తే.. మరోసారి పవర్లోకి రావటానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్న విషయాన్ని నేతలకు అర్థమయ్యేలా చెప్పటమే కాదు.. తాను ఎవరి పదవుల్ని పంచుకోవటానికి రాలేదని.. తన కారణంగా ఎవరికి నష్టం కలగదన్న భరోసాను ఇస్తున్నారట. దీంతో.. మొన్నటివరకు సిద్ధూను అధ్యక్షుడిగా ఎంపిక చేస్తే.. తాము సహకరించమని భీష్మించుకొని కూర్చున్న వారు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. రేవంత్ మొదలు పెట్టిన ఇంటి రాయబారం పార్టీకి సక్సెస్ మంత్ర అవుతుందా? లేదా? అన్నది కాలమే నిర్ణయించాలి.