హిందూపూర్ నుంచి నారా బ్రాహ్మణి పోటీ...?

Fri Mar 31 2023 20:00:01 GMT+0530 (India Standard Time)

Shri Bharat has given clarity on Nara Brahmani Political Entry

నందమూరి బాలక్రిష్ణ పెద్ద కుమార్తె  నారా వారి కోడలు నారా లోకేష్ సతీమణి అయిన బ్రాహ్మణి రాజకీయంగా అడుగులు వేస్తున్నారా. ఆమె తన తండ్రి మామ భర్త అడుగు జాడలలో రాజకీయ ప్రవేశం చేయాలనుకుంటున్నారా. ఎన్టీయార్  మనవరాలు నందమూరి రక్తం అయిన బ్రాహ్మణి 2024లో రాజకీయ అరంగేట్రం చేస్తారు అన్న వార్తలు అయితే చాలా కాలంగా చక్కర్లు కొడుతున్నాయి



దీనికి జవాబు అయితే ఏ వైపు నుంచి రావడం లేదు. కానీ వారి కుటుంబ సభ్యుడు బాలయ్య చిన్నల్లుడు అయిన శ్రీ భరత్ ఈ విషయంలో పక్కాగా క్లారిటీ ఇచ్చేశారు. ఆయనను ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూ చేసినపుడు బ్రాహ్మణి రాజకీయ జీవితం గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

తమ కుటుంబంలో ఎపుడూ ఈ విషయం మీద అసలు డిస్కషన్ రాలేదని అన్నారు. అసలు బ్రాహ్మణికి  ఆ ఆలోచనలు ఏవీ లేవని కూడా అన్నారు. ఈ వార్తను తాను ఫస్ట్ టైం వింటున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తన మామ బాలయ్య గుడివాడ నుంచి పోటీ చేస్తారు అన్న న్యూస్ కూడా కొత్తదే అన్నారు. రాజకీయంగా ఇవన్నీ రూమర్స్ గా ఆయన కొట్టిపారేశారు.

తన వరకూ చూస్తే తాను ఈసారి విశాఖ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లుగా శ్రీ భరత్ చెప్పారు. తనకు పార్లమెంట్ కి వెళ్లాలని ఆసక్తి ఉందని అన్నారు. తాను గీతం యూనివర్శిటీ చైర్మన్ గా ఉన్నానని తన బాధ్యతలు చూసుకుంటూ రాజకీయాలు చేయాలని అందువల్లనే ఎంపీ పదవినే ఇష్టపడతాను అని ఆయన అన్నారు.

అదే ఎమ్మెల్యే పదవి అంటే ఇరవై నాలుగు గంటల వ్యవహారం అని ఆయన అన్నారు. తనకు ఉన్న బాధ్యతల వల్ల అది కుదరదు అనేశారు. చంద్రబాబు అసెంబ్లీకి పోటీ చేయమంటే ఎలా రెస్పాండ్ అవుతారు అంటే తాను రాష్ట్ర రాజకీయాలకు ఇపుడున్న పరిస్థితుల్లో సూట్ అవను అని భావిస్తున్నాను అని ఆయన చెప్పేశారు. రాజకీయాల్లో చర్చలు అర్ధవంతంగా ఉండాలని విమర్శలు అయినా హుందాగా ఉండాలని భావిస్తాను అన్నారు.

కానీ ఏపీలో కొంతమంది అధికార పార్టీ నేతల కామెంట్స్ చూస్తే శృతి మించిపోతున్నాయని  అన్నారు. ఏపీ రాజకీయాలు మురికిగుంటలా మారిపోయాయని అందుకే తనలాంటి వాడు అందులో వేలూ కాలు పెట్టినా అసలు సూట్ అవడని ఆయన చెప్పేశారు. ఇక అర్ధవంతమైన డిబేట్ చట్ట సభలలో జరగాలన్నది తన అభిమతం అన్నారు.

చట్టసభలకు ఎన్నిక అయిన వారు ప్రజలకు సేవ చేయాలని అనేక కార్యక్రమాలను ప్రజోపయోగమైన  రూపొందించాలని ఆయన అన్నారు. తనకు ఎంపీగా పోటీ చేయాలని ఉందని తన ప్రయత్నం ఆ దిశగా సాగుతుందని ఆ మీదట దైవ నిర్ణయం అని ఆయన అంటున్నారు. ఇక తన మామ బాలయ్యలో తనకు నచ్చిన గుణాలు ఎన్నో ఉన్నాయని అన్నారు.

ఆయనను హీరోగా కంటే వ్యక్తిగా తాను ఆరాధిస్తాను అని శ్రీ భరత్ చెప్పడం విశేషం. బాలయ్యలో నిజాయతీ కష్టాలలో మాట ఇస్తే అండగా ఉండడం మానవత్వం మంచితనం ఇవన్నీ తనకు ఆయన అంటే ఇష్టాన్ని పెంచాయని చెప్పారు. మొత్తానికి చూస్తే బాలయ్య క్యారక్టర్ కి తాను పెద్ద ఫ్యాన్ అని శ్రీ భరత్ స్పష్టం చేశారు.

తాను బాలయ్య సినిమాలు అన్నీ చూస్తాను అని నచ్చిన సినిమాలు కూడా ఉన్నాయని అన్నారు. తనకు ఏ హీరో మీద అభిమానం కానీ వ్యతిరేకత కానీ ఉండదని సినిమా బాగుండే చూస్తాను అని శ్రీ భరత్ అన్నారు. ఇదిలా ఉంటే ఓటీటీ ద్వారా బాలయ్య చేస్తున్న రియాల్టీ షోస్ కూడా చూశానని అవి తనకు నచ్చాయని శ్రీ భరత్ అంటున్నారు. మొత్తానికి శ్రీ భరత్ ఉన్నది ఉన్నట్లుగా చెప్పే అతి కొద్ది మంది యువ నాయకులలలో ఒకరుగా  ఉన్నారు. మాట్లాడడం కాదు పని చేయడమే ముఖ్యం అనే శ్రీ భరత్ మంచి ప్రజా నాయకుడిగా రూపుదిద్దుకుంటారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.