Begin typing your search above and press return to search.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్లకు ఆ స్కూళ్లలో జాతీయ గీతాలాపన ఉండదా?

By:  Tupaki Desk   |   13 May 2022 3:23 AM GMT
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్లకు ఆ స్కూళ్లలో జాతీయ గీతాలాపన ఉండదా?
X
మతం.. కులం.. ప్రాంతం.. వీటన్నింటికి అతీతం దేశం. అలాంటిది దేశంలోని కొన్ని స్కూళ్లలో స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా జాతీయ గీతాలాపన జరగకుండా ఉండటం ఏమిటి? దేశంలోని ఏ స్కూల్ అయినా.. జాతీయ గీతాలాపన తప్పనిసరిగా ఫాలో అవుతున్నట్లు అనుకుంటాం. కాకుంటే.. లోతుల్లోకి వెళితే షాకింగ్ నిజాలు బయటకు వస్తాయి. ఆ కోవలోకే వస్తుంది ఇప్పుడు చెప్పే ఉదంతం.

దేశంలోని చాలా మదర్సాలలో జాతీయ గీతాలాపన చేయరన్న ఆరోపణ ఉంది. దీనిపై ఓపెన్ గా మాట్లాడటానికి రాజీకయ పార్టీలకు అస్సలు ఇష్టం ఉండదు. సెక్యులరిజం కబుర్లు చెప్పే పార్టీలు ఏవీ కూడా దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నా.. మదర్సాల్లో చదువుకునే లక్షలాది పిల్లలకు జాతీయ గీతాలాపన అస్సలు చేయరన్న కఠిన నిజం.. ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కారు జారీ చేసిన తాజా ఆదేశాలతో బయటకు వచ్చిందని చెప్పాలి. తాజాగా ఆ రాష్ట్రంలోని మదర్సాలలో ప్రతి ఒక్కరూ రోజువారీగా జాతీయ గీతాలాపన తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మదర్సా ప్రారంభం వేళలో జాతీయ గీతాలాపనను విద్యార్థుల చేత చేయించాలన్న ఆదేశాల్ని యూపీ ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల్ని పక్కాగా అమలు చేసే బాధ్యతను జిల్లాల మైనార్టీ సంక్షేమ అధికారులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని యోగి ప్రభుత్వం తేల్చింది. ఇదంతా చూస్తే.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లకు దేశంలోని పలు మదర్సాలలో జాతీయ గీతాలాపన ఉండదన్న మాట విస్మయానికి గురి చేయక మానదు. యోగి సర్కారు అమలు చేస్తున్న విధానాన్ని మిగిలిన రాష్ట్రాలు అందిపుచ్చుకుంటాయా? లేదా? అన్నది చూడాలి.