వైజాగ్ నవవధువు సృజన మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్

Thu May 12 2022 19:00:01 GMT+0530 (IST)

Shocking twist in the Vizag bride Srujana death case

అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు పెళ్లిపీటలపైనే ఒక్కసారిగా కుప్పకూలింది. పెళ్లికొడుకు ఆమె తలపై జీలకర్ర బెల్లం పెడుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. పెళ్లికూతురు కుప్పకూలడంతో ఆమె కళ్లు తిరిగి పడిపోయిందని భావించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ముఖంపై నీళ్లు చల్లినా లేవలేదు.కానీ ఆస్పత్రికి వెళ్లేసరికే వధువు ప్రాణాలు వదిలేసింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆమె బతకలేదు. ఈ విషాద ఘటన విశాఖలోని మధురవాడలో జరిగింది. పెళ్లితంతు కూడా పూర్తి కావచ్చిన సమయంలో అనుకోని ఈ ఘటన జరగడంతో అంతా షాక్ లోనే ఉండిపోయారు.తాజాగా నవవధువు మృతికి అసలు కారణం ఏంటన్నది తెలిసింది. సృజన శరీరంలో విషపదార్థం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. పెళ్లి పీటల మీదనే కుప్పకూలిన సృజనను ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి ఆమె మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. ఆమె శరీరంలో విషపదార్థం ఉన్నట్లుగా తేల్చారు. ప్రస్తుతం సృజన మృతదేహాన్ని కేజీహెచ్ కు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.

కాగా వివాహానికి నెలసరి అడ్డం వస్తుందని సృజనకు వారి తల్లిదండ్రులు ఒక ట్యాబ్ లెట్ ఇచ్చారని.. అది వికటించి చనిపోయి ఉంటుందని సృజన బంధువులు చెబుతున్నారు. ఇంకొందరు ఏమో పెళ్లి ఇష్టం లేక సృజన ఏదైనా విషపదార్థం తీసుకొని ఉండొచ్చని కొందరు అనుమానిస్తున్నారు. అయితే ఏం జరిగిందనేది అధికారికంగా మాత్రం ఇప్పటికీ బయటపడలేదు. పోస్టుమార్టంలో మాత్రం ఆమె విషపదార్థం వల్లే చనిపోయిందని తేలింది.

బుధవారం రాత్రి నాగోతి శివాజీ-సృజనల వివాహానికి ఏర్పాట్లు చేశారు. తాళికట్టే వేళ వధువు సృజన కుప్పకూలింది. వివాహ నేపథ్యంలో గత రెండు రోజులుగా పెళ్లి కూతురు అలసటకు గురై నీరసించిందని బంధువులు తెలిపారు. కానీ ఇలా ప్రాణాలు పోతుందని భావించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అంతకుముందు వధువు మృతిపై ఇరు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకరిపై ఒఖరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.