Begin typing your search above and press return to search.

తెలంగాణ లో భూములు కొనేవాళ్లకు షాకింగ్ న్యూస్

By:  Tupaki Desk   |   23 Jan 2020 6:44 AM GMT
తెలంగాణ లో భూములు కొనేవాళ్లకు షాకింగ్ న్యూస్
X
ఆర్థిక మాంద్యం చుట్టుముట్టింది. పన్నుల రాబడి తగ్గింది. ఖజానా ఖాళీ అవుతోంది. అందుకే సీఎం కేసీఆర్ కొత్త సంవత్సరం వేళ ఆదాయం సమకూర్చుకునేందుకు మద్యం ధరలను పెంచేశారు. కానీ అవి సరిపోనట్టు ఉన్నాయి. అందుకే తాజాగా భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచేందుకు రెడీ అయ్యారు..

తెలంగాణ లో భూముల ధరలు భారీగా పెరగాయి. పల్లెలు, పట్నాలు అనే తేడా లేకుండా ఐదారు రెట్లు పెరిగాయి. హైదరాబాద్ లో అయితే చుక్కలనంటున్నాయి. కానీ దానికి సరిపడా రిజిస్ట్రేషన్ విలువలు మాత్రం లేదు. దీంతో తెలంగాణ సర్కారు కు బొక్కపడుతోంది. తెలంగాణ లోనే అత్యంత ఖరీదైన జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ లో గజం లక్ష కు పైగానే ఉంది. కానీ అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ కేవలం 40వేలు మాత్రమే కావడం గమనార్హం.దీనివల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయానికి గండి పడుతోంది.

ఇక హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లో గజం ధర ఏకంగా రూ.79వేలు పలుకుతోంది. అక్కడ రిజిస్ట్రేషన్ ధర మాత్రం కేవలం రూ.7వేలు మాత్రమే. వ్యవసాయ భూములకు ఇదే ధర. దాదాపు 7 ఏళ్ల క్రితం నాటి ప్రభుత్వానికి భారీగా గండి పడుతున్న భూ రిజిస్ట్రేషన్ విలువలను పెంచేందుకు కేసీఆర్ సర్కారు రెడీ అయ్యింది.

అందుకే తాజాగా ఆయా ప్రాంతాలకునుగుణంగా 35 నుంచి 150శాతం వరకూ మార్కెట్ విలువలను పెంచుతూ వీటిని రూపొందించింది. అయితే తెలంగాణ వ్యాప్తంగా కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టులు, హైవేలు, పారిశ్రామిక కారిడార్లు, కొత్త యూనివర్సిటీలు, అభివృద్ధి సంస్థలు, ఐటీ క్లస్టర్లు వంటి ప్రాంతాల్లో భవిష్యత్ అంచనాలు రూపొందించుకొని భూముల రేట్ల పై ప్రతి పాదనలు పంపాలని కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ రూపొందించిన భూముల రిజిస్ట్రేషన్ చార్జీలపై మరోసారి రివ్యూ చేస్తోంది.

ఇటీవల కేంద్ర కేబినెట్ లో జీఎస్టీ పై జరిగిన సమావేశంలో ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ ధరలను పెంచడానికి నిర్ణయించింది. దీంతో తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేసింది. తెలంగాణ వ్యాప్తం గా దాదాపు 100శాతం నుంచి 150, 250 శాతం వరకూ కూడా రేట్లను పెంచడానికి తెలంగాణ సర్కారు రెడీ అవుతోంది. సో తెలంగాణ లో భూములు కొనాలనుకునే వారు వెంటనే కొంటే మంచిది. లేదంటే లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ కే వెళ్లి పోతుంది.