నివాసం భారత్ లో నిద్ర మయన్మార్ లో..

Mon Mar 01 2021 08:55:07 GMT+0530 (IST)

Shocking Facts About Longwa Village

దేశ సరిహద్దు గ్రామాల ప్రజలు ఎంత భయంగా భయంగా బతుకుతారో తెలిసిందే. నిత్యం తుపాకీ గుళ్లు.. సైనికుల కవాతులతో ఆ ప్రాంతాలు అట్టుడుకుతుంటాయి. అయితే భారత్మయన్మార్ సరిహద్దులో ఉన్న ఓ గ్రామం మాత్రం ఎంతో విచిత్రంగా ఉంది. అక్కడి ప్రజలకు రెండు దేశాలు  పౌరసత్వం ఇచ్చాయి. దీంతో వాళ్లు ఇరుదేశాలు అందజేసే పథకాలను అనుభవిస్తున్నారు. ఆ గ్రామం ఎక్కడ ఉంది.. దాని చరిత్ర ఏమిటో ఓ సారి తెలుసుకుందాం..ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లోని మన్ జిల్లాలో లోంగ్వా అనే గ్రామం ఉంది. ఈ గ్రామం సరిగ్గా మయన్మార్.. భారత్ సరిహద్దు దగ్గర ఉంది. ఈ గ్రామం మధ్యలో నుంచి ఇరు దేశాల సరిహద్దు రేఖ వెళుతుంది.  ఇక్కడ కొణ్యక్ అనే గిరిజన తెగకు చెందిన ప్రజలు నివసిస్తుంటారు. ఈ గ్రామ పెద్ద పేరు కొణ్యక్ సింగ్ . ఆయన ఇల్లు సరిగ్గా రెండు దేశాల సరిహద్దు రేఖమీద ఉంది. ఆయన భోజనాల గది భారత్లో ఉంటే.. పడక గది మాత్రం మయన్మార్లో ఉంది. దీంతో ఆయన మనదేశంలో భోజనం చేసి .. మయన్మార్లో నిద్రచేస్తాడన్నమాట.

ఈ ఊళ్లోని యువకుల్లో కొంతమంది మనదేశంలో వ్యాపారం చేస్తున్నారు. మరికొందరేమో.. మయన్మార్ సైన్యంలో పనిచేస్తున్నారు. ఆ దేశ ప్రజలు ఏమంటారంటే.. ‘ భారత్కు మయన్మార్కు మాకు పెద్దగా తేడా లేదు. రెండు దేశాలు మమ్మల్ని ఆదరిస్తాయి’ అని వాళ్లు చెబుతుంటారు. ఈ గ్రామంలోని ప్రజలను ‘హెడ్ హంటర్స్’ ఆదివాసీలుగా పేర్కొంటారు. వీరి చరిత్రకు సంబంధించి కూడా అనేక ఆసక్తి కరమైన విషయాలు ఉన్నాయి. వీళ్లు తమ శత్రువులుగా భావించే గిరిజనలు తలలు నరికేవారట. ఇది వాళ్ల సంప్రాదాయం.

అయితే 1960లో ఇక్కడ క్రైస్తవం వచ్చింది. వీళ్లలో చాలా మంది క్రైస్తవ మతంలోకి వెళ్లారు. దీంతో ఈ దురాచారం కూడా పోయింది. అయితే ప్రస్తుతం ఈ తెగకు చెందిన వాళ్లు ఇరుదేశాల్లో కలిసి దాదాపు 20 లక్షలమంది ఉన్నారట.