Begin typing your search above and press return to search.

సామాన్యుడికి షాక్ మీద షాక్ ... సిలిండ‌ర్ ధ‌ర‌ ఏకంగా రూ.95 పెంపు !

By:  Tupaki Desk   |   1 March 2021 7:30 AM GMT
సామాన్యుడికి షాక్ మీద షాక్ ... సిలిండ‌ర్ ధ‌ర‌ ఏకంగా రూ.95 పెంపు !
X
సామాన్యులకి వరుస షాకులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. సెంచరీ కొట్టి జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. వంట నూనెల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి తోడు సిలిండర్ రేటు కూడా భగ్గుమంటోంది. తాజాగా ఎల్పీజీ సిలిండర్ ధర మరోసారి భారీగా పెరిగింది. నేటి నుంచి సిలిండర్‌ బుక్ చేసే వారిపై అదనపు భారం పడబోతోంది.చమురు కంపెనీలు వంట గ్యాస్ ధర పెంచాయి. వంట గ్యాస్ ధరను రూ.25 పెంచిన చమురు కంపెనీలు.. వాణిజ్య(కమర్షియల్) గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ కూడా పెంచాయి.

వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్ ధరను ఏకంగా రూ.95 పెంచాయి. దీంతో ఒక కమర్షియల్ సిలిండర్ ధర రూ.1614కి చేరింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. చమురు కంపెనీలు నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి వంటగ్యాస్‌ ధరను పెంచినట్లు అయ్యింది. గత నెల 25న సిలిండర్‌ పై రూ.25 పెంచిన కంపెనీలు తాజాగా మరో రూ.25 భారంమోపాయి. ఫిబ్రవరిలో సిలిండర్‌ ధరలను మూడు సార్లు సవరించిన విషయం తెలిసిందే. ఆ నెలలో మొత్తంగా రూ.100 అధికమైంది. 2020 డిసెంబర్‌ 1 నుంచి ఇప్పటివరకు వంటగ్యాస్‌పై రూ.225 పెరిగింది. సిలిండర్ ధరలతో పాటు వాహనాల ఇంధన ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరలు రూ. 100 చేరితే.. ఎల్పీజీ ధరలు వెయ్యి మార్క్ వైపు పరుగులు పెడుతున్నాయి. డీజిల్‌తో పాటు సిలిండర్ ధరలు కూడా పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.

గత ఏడాది డిసెంబరు‌ 1న సిలిండర్‌ ధర రూ.594 నుంచి రూ.644కి పెంచారు. ఆ తర్వాత జనవరి 1న రూ.644 నుంచి రూ.694కు పెంచారు. ఈ నెల 4న ధ‌ర‌ రూ.719కి చేరింది. 15న రూ.769 చేరింది. 25న మ‌రో 25 రూపాయ‌లు, ఈ రోజు మ‌రో రూ.25 పెంపుతో ఢిల్లీలో సిలిండర్‌ ధర రూ.819కి చేరింది. ఇక వాణిజ్య సిలిండర్‌పైనా ఈ రోజు రూ.95 పెరగడంతో, సిలిండర్‌ ధర రూ.1,614కు చేరింది.