ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక : బీఆర్ఎస్ కు షాక్.. బీజేపీ బలంతో ఏవీఎన్ రెడ్డి విజయం

Fri Mar 17 2023 09:38:05 GMT+0530 (India Standard Time)

Shock For BRS in Teacher MLC Elections

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది.  అసెంబ్లీ ఎన్నికల సమరానికి ముందు జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికలకు వెళ్లాయి. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజారిటీ కారణంగా ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా విజయం సాధించారు.కానీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చే ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన ఏవీఎన్ రెడ్డి విజయాన్ని కైవసం చేసుకున్నారు.

ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు.  ఆయన తన సమీప ప్రత్యర్థి పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి అయిన గుర్రం చెన్నకేశవరెడ్డిపై సుమారు 1150 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఫలితాలు వెలువడ్డాయి.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెమీస్ గా ఈ ఎన్నికలను భావించిన ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఎప్పుడైనా ఎన్నికలలో ఉపాధ్యాయులు కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. కాబట్టి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కీలకంగా తీసుకున్నాయి.

అయితే బీజేపీ ఈ ఎన్నికల ఫలితాలలో విజయం సాధించి కేసీఆర్ కు గట్టి షాక్ ఇచ్చింది.ఉద్యోగ ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చిన కేసీఆర్ వాటిని నెరవేర్చలేదన్న కోపం ఆ వర్గాల్లో ఉంది. దీన్ని బండి సంజయ్ చేసిన ప్రచారంతో బీజేపీకి అనుకూలంగా మార్చుకున్నారు. బీజేపీ సపోర్ట్ చేసిన ఏవీఎన్ రెడ్డి విజయానికి ఇదే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తానికి బీజేపీ నేతలు ఊహించినట్టే తెలంగాణలో ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరుద్యోగులు మేధావుల  మద్దతు మాత్రం బీజేపీకి దక్కుతున్నట్టుగా తెలుస్తోంది. ఏవీఎన్ రెడ్డి విజయంతో అధికార బీఆర్ఎస్ ఆ వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతోందని అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో వీరి విషయంలో కేసీఆర్ ఎలా ముందుకెళుతాడో చూడాలి.  నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.