Begin typing your search above and press return to search.

శివసేనలో మొదలైన తిరుగుబాటు ..!

By:  Tupaki Desk   |   19 Nov 2019 12:46 PM GMT
శివసేనలో మొదలైన తిరుగుబాటు ..!
X
శివసేన .. ప్రస్తుతం దేశ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తుంది. మహారాష్ట్రలో బీజేపీ తో పొత్తుతో బరిలోకి దిగి ..ఎన్నికల ఫలితాల అనంతరం అధికారం కోసం పొత్తుని కూడా కాదు అనుకోని బీజేపీ నుండి బయటకి వచ్చింది. సేన - బీజేపీ కి కలిపి కావాల్సినంత మెజారిటీ ఉన్నప్పటికీ ..ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోయారు. ఈ నేపథ్యంలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై పార్టీలోని సగానికి సగం మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది.

బీజేపీతో కాకుండా ఎన్సీపీ - కాంగ్రెస్‌ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతుండటంపై ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీని ఆహ్వానించారు. కానీ - తమ వద్ద కావల్సిన సంఖ్యాబలం లేదని బీజేపీ వెనక్కి తగ్గింది. ఈ సమయంలో శివసేన అధిష్ఠానం ఆ పార్టీ ఎమ్మెల్యేలందర్నీ ముంబైలోని ఓ హోటల్‌ కు తరలించింది. ఈ హోటల్లోనే పార్టీ ఎమ్మెల్యేలు అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చిరకాల మిత్రపక్షమైన బీజేపీని కాదని, భావజాల పరంగా వైరుద్ధ్యమున్న ఎన్సీపీ - కాంగ్రెస్‌ తో ఎలా కలిసి వెళ్తారని వారు సీరియస్‌ అయినట్లు సమాచారం.

ఆలా కొన్ని రోజులు హోటల్‌ లో ఉంచిన తర్వాత ఆ ఎమ్మెల్యేలను తమతమ సొంత ఇళ్లకు ఎందుకు తరలించారని ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై కూడా ఉద్ధవ్‌ పై సగం మంది ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాకుండా ఈ విషయంపై అదే హోటల్‌ లో ఎమ్మెల్యేలు ఒకరినొకరు తీవ్ర దుర్భాషలు ఆడుకోవడమే కాకుండా, ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నట్లు శివసేన అంతర్గత వర్గాలు చెప్తున్నాయి. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ యువనేత ఆదిత్య ఠాక్రే వెంటనే ఆ హోటల్‌ కు చేరుకొని ఎమ్మెల్యేలందరిని శాంతపరిచినట్లు తెలుస్తోంది. అయితే కొందరు ఎమ్మెల్యేలైతే ఏకంగా అధిష్ఠానం ముందే ఈ వైఖరి మంచిది కాదు అంటూ అని చెప్పినట్టు తెలుస్తోంది. ఇన్నేళ్లుగా భావజాలపరంగా తీవ్ర విభేదాలున్న పార్టీలతో మనం ఎలా కలిసి నడుస్తాం అని సంగం మంది ఎమ్మెల్యేలు అడుగుతునట్టు సమాచారం.