కాంగ్రెస్ అవుట్.. శివసేన - ఎన్సీపీ పొత్తు...!

Thu Jan 20 2022 22:00:27 GMT+0530 (IST)

Shiv Sena - NCP .. shocking alliance ..!

కాంగ్రెస్ ఇప్పటికే రెండు సాధారణ ఎన్నికల్లో ఓడిపోయింది. అసలు చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రాంతీయ పార్టీల స్థాయి కన్నా దిగువకు జారీపోయింది. జాతీయ రాజకీయాల్లో ఎంత పుంజుకోవాలని.. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కాంగ్రెస్‌ను ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. ఒకప్పుడు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం చివరకు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీలు చెప్పినన్ని సీట్లు తీసుకుని మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాల్సిన దుస్థితిలో కాంగ్రెస్ ఉంది. అసలు సొంతంగా ఎదిగేందుకు కాంగ్రెస్ ఏ మాత్రం ప్రయత్నాలు చేస్తోన్న పరిస్థితి లేదు.తాజాగా పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కనీసం ఆ రాష్ట్రాన్ని అయినా నిలబెట్టుకుంటుందా ? అంటే నో అన్న ఆన్సర్లే వినిపిస్తున్నాయి. అసలు అక్కడ గెలిచేందుకు సరైన ప్రణాళికలు కూడా కాంగ్రెస్ రచించడం లేదన్న చర్చలు జాతీయ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పార్టీలో తీవ్రమైన అంతర్గత విబేధాలు ఉన్నా కూడా కాంగ్రెస్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇక గోవాలో గత ఎన్నికల్లో అధికారానికి దగ్గరగా వచ్చి చతికిలపడిన కాంగ్రెస్ ఇప్పుడు మరోసారి బీజేపీపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నా కూడా చిత్తుగా ఓడిపోబోతుందా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమి పేరుతో శివసేన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని ఈ పార్టీలు భావించాయి. అయితే ఇప్పుడు ఆ సత్తా కాంగ్రెస్‌కు లేదని తప్పుకుంటున్నాయి. బెంగాల్ సీఎం మమత.. బీజేపీకి తానే ప్రత్యామ్నాయం అన్నట్టుగా ఉన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఫోకస్ పెట్టాలనే ఆమె గోవాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

గోవా ఎన్నికల్లో శివసేన ఎన్సీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. విచిత్రం ఏంటంటే మహారాష్ట్రలో కూటమిలో ఉన్న పార్టీలే ఇప్పుడు గోవాలో కాంగ్రెస్‌ను పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ గోవాలో బీజేపీని ఎలాగైనా గద్దె దింపాలని ప్రయత్నిస్తుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న శివసేన అసలు కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా పొత్తులు కుదుర్చుకుని పోటీ చేస్తుండడం జాతీయ రాజకీయ వర్గాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. ఇక గోవాలో కాంగ్రెస్‌కు ఒంటరి పోరే గతి కానుంది.