Begin typing your search above and press return to search.

షిండే టీంలోని మంత్రుల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే.. షాక్ తినాల్సిందే

By:  Tupaki Desk   |   12 Aug 2022 12:31 PM GMT
షిండే టీంలోని మంత్రుల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే.. షాక్ తినాల్సిందే
X
అప్పుడెప్పుడో తెలుగులో ఒక సినిమా వచ్చింది. ఉమ్మడి ఏపీ మ్యాప్ ను పెట్టుకొని.. అందులో రాష్ట్రాన్ని ఎవరు ఏ ముక్క కావాలో ముఖ్యమంత్రి అడగటం.. మంత్రులు తమ ఆశను చెప్పి.. తమకు కావాల్సిన వాటాను కోరుకోవటం చూసి.. ఇలాంటి పాలకులు వస్తే ప్రజల పరిస్థితి ఏమిటి? అన్న ఉలికిపాడు ఆ సీన్ చూస్తున్నప్పుడు కలుగుతుంది. మరీ. అంత కాకున్నా.. మహారాష్ట్రలో ప్రస్తుతం కొలువు తీరిన షిండే సర్కారులో మంత్రులుగా వ్యవహరిస్తున్న వారి బ్యాక్ గ్రౌండ్ ను చెక్ చేసినప్పుడు షాకింగ్ వాస్తవాలు వెలుగు చూశాయి. తాజాగా ఆయన తన మంత్రివర్గాన్ని విస్తరించిన సంగతి తెలిసిందే.

ఆయన మంత్రులుగా ఎంపిక చేసుకున్న నేతల ఎన్నికల అఫిడవిట్ లను పరిశీలించి.. లెక్క తేల్చినప్పుడు బయటకు వచ్చిన అంశాల్ని చూస్తే.. షిండేగారి మంత్రివర్గంలో ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయా? అనిపించక మానదు. షిండే కేబినెట్ లో మంత్రులుగా ఎంపికైన వారిలో 75 శాతం మంది క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. ఆ విషయాన్ని వారు తమ ఎన్నికల అఫిడవిట్ లోనూ పేర్కొనటం గమనార్హం.

తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ సంస్థ విడుదల చేసిన నివేదికలో షిండే మంత్రి వర్గంలోని మంత్రుల వివరాలు.. వారి బ్యాక్ గ్రౌండ్ గురించి వెల్లడించారు. ఈ నివేదికతో షిండే మంత్రి వర్గంలోని అత్యధిక మంత్రులు నేర చరితులన్న విషయం స్పష్టమవుతుంది. సొంత పార్టీకి చెందిన ఉద్దవ్ ప్రభుత్వాన్ని కూలదోసిన షిండే.. బీజేపీతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. తిరుగుబాటు నేతగా మారిన షిండేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిన బిజేపీ అధినాయకత్వం తమ పార్టీకి చెందిన ఫడ్నవీస్ ను ఉప ముఖ్యమంత్రి కుర్చీకి పరిమితం చేశారు.

జూన్ 30న మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఆయన తన మంత్రివర్గాన్ని మాత్రం విస్తరించలేదు. అధికారంలోకి వచ్చిన దాదాపు నెలన్నర రోజులకు (మరింత కచ్ఛితంగా చెప్పాలంటే 41 రోజులకు) కేబినెట్ ను విస్తరించారు. మొత్తం 18 మందికి మంత్రి పదవులు లభించాయి. కేబినెట్ లోని 20 మందిలో 15మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 13 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.

ఇక.. మంత్రులుగా ఉన్న వారంతా కోటీశ్వరులే కావటం గమనార్హం. మంత్రుల సరాసరి ఆస్తుల విలువ రూ.47.45 కోట్లుగా ఉన్నట్లు చెబుతున్నారు. షిండే టీంలో అత్యంత సంపన్నుడిగా మంత్రి మంగల్ ప్రభాత్ లోధా నిలిచారు. ఆయన ఆస్తి (అధికారికంగా ప్రకటించింది) రూ.441.65 కోట్లు. అతి తక్కువ ఆస్తులున్న మంత్రిగా భుపరె సందీపన్ రావు అసారం నిలిచారు.

రికార్డుల ప్రకారం ఆయన ఆస్తి కేవలం రూ.2.92 కోట్లు మాత్రమే. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. షిండే వారి ప్రభుత్వంలో మంత్రులుగా మహిళలు ఎవరికి అవకాశం లభించకపోవటం. ఇక.. మంత్రుల్లో 40 శాతం మంది విద్యార్హత పది నుంచి ప్లస్ టూ వరకు ఉన్నారు. 55 శాతం మంది మాత్రం గ్రాడ్యూయేన్.. దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉన్నారు. మొత్తానికి.. షిండే వారికి తగ్గట్లే ఆయన టీం ఉందన్న మాట వినిపిస్తోంది.