అఫీషియల్: ధావన్ ఔట్.. పంత్ ఇన్

Wed Jun 19 2019 19:52:18 GMT+0530 (IST)

Shikhar Dhawan ruled out of World Cup with thumb fracture

అనుమానాలే నిజమయ్యాయి. భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించాడు. అతను ఈ నెల 9న ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ధావన్ ఎడమ చేతి బొటనవేలి పైభాగంలో బంతి తగిలి చీలిక వచ్చింది. గాయంతోనే అతను బ్యాటింగ్ కొనసాగించి సెంచరీ కూడా చేశాడు. ఐతే ఆ మ్యాచ్‌లో భారత్ ఫీల్డింగ్ చేస్తున్నపుడు ధావన్ మైదానంలో లేడు. తర్వాతి రెండు మ్యాచ్ లకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. మొదట గాయం కారణంగా ధావన్‌కు మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అయితే తాజాగా స్కానింగ్ చేయగా గాయం తగ్గకపోవడంతో అతడు కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.భారత్ సెమీస్ చేరడం పెద్ద కష్టం కాదు కాబట్టి సెమీస్ సమయానికైనా.. ధావన్ అందుబాటులోకి వస్తే చాలని భారత జట్టు ఆశించింది. కానీ అతను జులై నెల మధ్యకు కానీ కోలుకునే అవకాశం లేదని వైద్యులు తేల్చారు. దీంతో ధావన్ ను ప్రపంచకప్ నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ధావన్ గాయపడగానే బ్యాకప్ కోసం ఇప్పటికే వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ ను బీసీసీఐ ఇంగ్లాండ్ కు పంపింది. ధావన్ టోర్నీకి దూరమవుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో అతడి స్థానంలో పంత్ నే జట్టులోకి తీసుకుంటున్నారు. ఈ మేరకు బీసీసీఐ.. ఐసీసీకి విజ్నప్తి చేసింది. ఈ సెలక్షన్ కు ఐసీసీ ఆమోదం తెలపడం లాంఛనమే. ధావన్ స్థానంలో గత మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసిన సంగతి తెలిసిందే. టోర్నీ అంతటా అతనే రోహిత్ తో కలిసి ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నాడు.