Begin typing your search above and press return to search.

అక్రమ మార్గాల్లో దర్శనాలు.. టీటీడీ వలలో చిక్కిన ఎమ్మెల్సీ!

By:  Tupaki Desk   |   21 April 2023 7:41 PM
అక్రమ మార్గాల్లో దర్శనాలు.. టీటీడీ వలలో చిక్కిన ఎమ్మెల్సీ!
X
ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలకు నిత్యం 80 వేల మందికి తక్కువ కాకుండా భక్తులు వస్తుంటారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌ నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా భారీ స్థాయిలో వస్తుంటారు. వారంతా దేవదేవుడి దర్శనం, వివిధ ఆర్జిత సేవలు చేసుకోవడానికి మొగ్గు చూపుతుంటారు.

అయితే వీరికి దర్శనం చేయిస్తామని, వసతి ఇప్పిస్తామని చెబుతూ మోసం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అలాగే తమ పలుకుబడితో దర్శనం చేయిస్తామని చెప్పే రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. సిఫార్సు లేఖలను ఇస్తూ వాటిని భారీ ఎత్తున సొమ్ము చేసుకునేవారు తక్కువేమీ కాదు. ఇలాంటివారిని తరచూ టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) విజిలెన్స్‌ పట్టుకుంటూనే ఉంది.

ఈ నేపథ్యంలో ఏకంగా ఏపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఒకరు ఇలా అక్రమ మార్గాల్లో భక్తులకు తన సిఫార్సు లేఖలను జారీ చేస్తూ టీటీడీ విజిలెన్స్‌ కు దొరికిపోయారని అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన షేక్‌ సాబ్జీ ప్రస్తుతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్నారు.

ఈ క్రమంలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ వేరే రాష్ట్రాల భక్తులకు సిఫార్సు లేఖలు జారీ చేశారని అంటున్నారు. ఇలా ఒక్క నెలలోనే 19 సార్లు సిఫారసు లేఖలు ఇచ్చారని చెబుతున్నారు. ఆయన సిఫారసు లేఖల మీద తరచూ శ్రీవారి దర్శనానికి వస్తుండడంతో అనుమానించిన టీటీడీ ఉన్నతాధికారులు.. దీనిపై విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అందించారని తెలుస్తోంది.

తాజాగా ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ తిరుమల దర్శనానికి 14 మంది భక్తులను తీసుకొచ్చినట్టు సమాచారం. ఇలా పదే పదే భక్తులను తీసుకుని దర్శనానికి వస్తుండటం అనుమానమొచ్చిన ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విజిలెన్స్‌ విభాగం తనిఖీలు నిర్వహించిందని చెబుతున్నారు.

ఈ తనిఖీల్లో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ ఫోర్జరీ ఆధార్‌ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకెళ్తున్నట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. ఆరుగురిని దర్శనానికి తీసుకెళ్లడానికి ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ రూ.లక్షా 5 వేలు తీసుకున్నట్టు చెబుతున్నారు.

ఈ మొత్తాన్ని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ డ్రైవర్‌ ఖాతాకు సదరు భక్తులు పంపారని విజిలెన్స్‌ అధికారులు అంటున్నారు. ఇలా ఎమ్మెల్సీ సాబ్జీ ఒక్క నెల వ్యవధిలోనే 19 సిఫార్సు లేఖలు జారీ చేశార ని విజిలెన్స్‌ అధికారులు చెబుతున్నారు.

అందులోనూ ఎమ్మెల్సీ ప్రతి సిఫార్సు లేఖను ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులకే ఇచ్చినట్లు టీటీడీ విజిలెన్స్‌ గుర్తించిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల ఫిర్యాదుతో ఎమ్మెల్సీపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు సమాచారం.