Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌ ఉగ్ర కుట్రలో సంచలన విషయాలు!

By:  Tupaki Desk   |   6 Feb 2023 1:01 PM GMT
హైదరాబాద్‌ ఉగ్ర కుట్రలో సంచలన విషయాలు!
X
హైదరాబాద్‌ లో పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా, ఐఎస్‌ఐ ఉగ్ర కుట్రల పన్నాగంపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) రంగంలోకి దిగింది. ఈ క్రమంలో హైదరాబాద్‌ మూసారంబాగ్‌కు చెందిన జాహెద్‌ అలియాస్‌ అబ్దుల్, హుమాయున్‌నగర్‌ నగర్‌ కు చెందిన మాజ్‌ హసన్‌ ఫరూఖ్, సైదాబాద్‌ అక్బర్‌ బాగ్‌కు చెందిన సమీయుద్దీన్‌ లపై కేసు నమోదు చేసింది. కాగా ఈ ముగ్గురూ హైదరాబాద్‌ లోని రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లకు, ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్నారనే సమాచారంతో ఈ ముగ్గురినీ హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు గతేడాది అక్టోబరులోనే అరెస్టు చేసి రిమాండ్‌ కు పంపిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు జరపడానికి పాకిస్థాన్‌ నుంచి హవాలా రూపంలో ఈ ముగ్గురూ నిధులు అందుకున్నారని సమాచారం. అలాగే వీరికి బాంబు పేలుళ్లు జరపడానికి మందుగుండు సామగ్రి సమకూరిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో కేసు తీవ్రత దృష్ట్యా ఎన్‌ఐఏ తాజాగా రంగంలోకి దిగింది.

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల కోసం పాకిస్థాన్‌ నుంచి హవాలా మార్గంలో రూ.40 లక్షలు జాహెద్‌కు సమకూరాయని తేలింది. వీటితో కొన్న ఎన్‌ ఫీల్డ్‌ వాహనంతోపాటు రూ.15 లక్షల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా ఎన్‌ఐఏ తాజాగా కేసులు నమోదు చేసిన జాహెద్‌పై గతంలోనే పలు కేసులు ఉండటం గమనార్హం. 2005లోనే హైదరాబాద్‌ టాస్కుఫోర్స్‌ కార్యాలయం పేల్చివేత కేసులో జాహెద్‌ జైలుశిక్ష అనుభవించాడు. అలాగే 2004లో బీజేపీ సానుభూతి కార్యకర్తల హత్యకు కుట్రపన్నాడు. 2012లో జైలు సిబ్బందిపై దాడి ఘటనల్లోనూ జాహెద్‌ పై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో జాహెద్‌ 2005 నుంచి 2017 వరకు జైలు శిక్ష అనుభవించాడు.

అయితే టాస్కుఫోర్స్‌ కార్యాలయం పేల్చివేత కేసును న్యాయస్థానం కొట్టేయడంతో 2017 ఆగస్టు 10న జాహెద్‌ జైలు నుంచి బయటకొచ్చాడు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా బుద్ధి మార్చుకోకుండా జాహెద్‌ ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి పారిపోయి పాకిస్థాన్‌లో తలదాచుకున్న ముగ్గురు ఉగ్రవాదులతో జాహెద్‌ సంబంధాలు కొనసాగించాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

2002లో హైదరాబాద్‌ లో దిల్‌ సుఖ్‌ నగర్‌ లో సాయిబాబా ఆలయం పేల్చివేతకు కుట్ర, అదే ఏడాది గుజరాత్‌లో అక్షర్‌ధామ్‌ ఆలయంపై దాడి, 2004లో సికింద్రాబాద్‌ లో గణేశ్‌ ఆలయం పేల్చివేతకు కుట్ర, 2012లో బెంగళూరు, నాందేడ్‌ లలో పేలుళ్లకు కుట్ర తదితరాల్లోనూ జాహెద్, అతడి అనుచరుల హస్తం ఉందని వెల్లడైంది.

హైదరాబాద్‌ లో బాంబు పేలుళ్లకు నగరానికి చెందిన అబ్దుల్‌ కలీమ్, ఆదిల్‌ అఫ్రోజ్, సమీయుద్దీన్, మాజ్‌ హసన్‌ ఫారూఖ్, అబ్దుల్‌ రవూఫ్, వాజిద్‌ ఖాన్, ఇర్ఫాన్, ఉమర్‌ సుబ్రమణ్యంలతో ఉగ్ర ముఠా ఏర్పాటు చేశాడని స్పష్టమైంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.