Begin typing your search above and press return to search.

మాస్క్‌లు.. వైర‌స్ వ్య‌ర్థాల‌తో ప‌ర్యావ‌ర‌ణానికి పొంచి ఉన్న ముప్పు!

By:  Tupaki Desk   |   17 July 2020 1:30 AM GMT
మాస్క్‌లు.. వైర‌స్ వ్య‌ర్థాల‌తో ప‌ర్యావ‌ర‌ణానికి పొంచి ఉన్న ముప్పు!
X
ప్రాణాంత‌కంగా మారిన మ‌హ‌మ్మారి వైర‌స్ బారిన ప‌డ‌కుండా ప్ర‌జ‌లు మాస్క్‌లు.. శానిటైజ‌ర్లు వినియోగిస్తున్నారు. ఈ క్ర‌మంలో వాటిని వాడి ప‌డేస్తున్నారు. వాటి వినియోగం పెర‌గ‌డంతో వాటి వ్య‌ర్థాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే కాలుష్యం తీవ్రంగా పెరుగుతుండ‌గా ఇప్పుడు ఈ వైర‌స్ క‌ట్ట‌డికి వినియోగిస్తున్న వ‌స్తువులు కూడా కాలుష్యం పెర‌గ‌డానికి దోహ‌దం చేస్తున్నాయి. ఈ వైరస్ రాకుండా మాస్కుల వినియోగం భారీగా పెరిగింది. వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ప్రభుత్వ అధికార వర్గాలతోపాటు సాధారణ ప్రజలు కూడా మాస్కులను తప్పనిసరిగా చేసుకున్నారు. వీటిల్లో మెడికల్‌ మాస్కులు ఎన్ ‌95, సర్జికల్‌ మాస్కులతోపాటు వివిధ రకాలు ఉన్నాయి. వాటిని వినియోగిస్తున్నాయి.

అయితే ఆ వినియోగించిన మాస్క్‌ల‌ను ప్ర‌జ‌లు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ప‌డేస్తున్నారు. దీనిద్వారా వాతావ‌ర‌ణ కాలుష్యం పెరుగుతోంద‌ని శాస్త్ర‌వేత్త‌లు.. ప‌లు సంస్థ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. తాజాగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నెలకు దాదాపు 10 కోట్ల మాస్కులు వాడుతున్నారని అంచ‌నా వేసింది. భార‌త‌దేశంలో సగటున రోజుకు దాదాపు 25 లక్షల మెడికల్‌ మాస్కులు వినియోగిస్తున్నట్లు భారత వైద్య మండలి (ఎంసీఐ) గుర్తించింది. ఇక తెలంగాణ‌లో రోజుకు దాదాపు 1.20 లక్షల మెడికల్‌ మాస్కులు వాడుతున్నారని గ‌ణాంకాలు చెబుతున్నాయి. వినియోగించిన అనంత‌రం మాస్కుల వ్యర్థాల నిర్వహణ ఒక త‌ల‌నొప్పిగా మారింది. డబ్ల్యూహెచ్ఓ.. కేంద్ర ప్రభుత్వ సాలీడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యర్థాలపై నిబంధనలు విధానాలు నిర్దేశించాయి.

వైర‌స్ వ్యర్థాలను సక్రమంగా నిర్వహించకుంటే వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాది 130 బిలియన్ల మాస్కుల వ్యర్థాలు సముద్రంలో చేరతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తుండటం ఆందోళ‌న క‌లిగిస్తోంది. సముద్ర జలాల్లోజెల్లీఫిష్‌ల కంటే మాస్కుల వ్యర్థాలే ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అందుకే వైర‌స్ క‌ట్ట‌డి కోసం వినియోగిస్తున్న వైద్య వ‌స్తువులు.. ప‌రిక‌రాలు ప్ర‌భుత్వ ఆదేశాలు.. నిబంధ‌న‌ల ప్ర‌కారం పార‌వేయాలి. అలా చేస్తే ప‌ర్యావ‌ర‌ణంతో పాటు స‌మాజ ఆరోగ్యం కోసం ప‌ని చేసిన వార‌వుతారు.