ఈమెను జాగ్రత్తగా చూడండి.. ఫ్యూచర్ లో మీకు వల విసిరే వీలుంది

Sun Feb 28 2021 07:00:02 GMT+0530 (IST)

Scam In The Name Of Marriage In Nellore

ఒకటి కాదు రెండు కాదు.. పదే పదే  చేసిన నేరమే చేసే అలవాటు ఈమె సొంతం. బాగానే చదువుకున్నా.. సింఫుల్ గా భారీ ఎత్తున డబ్బులు కొట్టేయాలన్న దుర్మార్గమైన ఆలోచన.. ఆమెను తప్పుడు దారిలోకి వెళ్లేలా చేసింది. అంతేకాదు.. జైలుకు వెళ్లి వచ్చినా తన బుద్ధిని మార్చుకోని ఈమె మహా డేంజరస్. అసలు ఫోటోను దాచేసి.. అందమైన అమ్మాయిల ఫోటోలతో వల విసిరి.. లక్షలు కొల్లగొట్టే ఈ కిలేడీ పేరు స్వాతి.నెల్లూరుకు చెందిన ఆమె ఎంబీఏ పూర్తి చేసింది కూడా. ఇప్పటికే పెళ్లైనప్పటికి.. పెళ్లి కోసం ఎదురుచూస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వటం.. అమాయకుల్ని ఎంచుకొని వారిని దారుణంగా మోసం చేయటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఆమె భర్త ప్రైవేటు లెక్చరర్ అయినప్పటికి.. తాను బాగా డబ్బున్న అమ్మాయి అన్నట్లుగా పరిచయం చేసుకొని ముగ్గులోకి దించుతుంది.

అమెరికాలో స్థిరపడ్డ తెలుగు అమ్మాయిలా ఫోజులిస్తూ.. సంబంధం లేని అమ్మాయిల ఫోటోల్ని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకొని తెలుగు మ్యాట్రిమోనీ వెబ్ సైట్లలో నకిలీ ప్రొఫైల్ పెట్టటం ఈమెకు బాగా అలవాటు. ఆ ఫోటోల్ని నిజమని నమ్మి.. ఆమె ఉచ్చులో పడుతుంటారు పలువురు అమాయకులు. అమెరికా నుంచి ఫోన్ చేసినట్లు నమ్మించేందుకు వర్చువల్ ఫోన్ నెంబర్లతో కాల్ చేసి.. తన దొంగాటను మరింతగా రక్తి కట్టించటం ఆమెకు అలవాటు. పరిచయం.. అనంతరం పెళ్లికి సిద్ధమని చెప్పి.. ఇండియాకు వస్తున్నట్లుగా నాటకాలు ఆడుతుంది.

అంతా సెట్ అయిందనుకున్న తర్వాత అసలు డ్రామాకు తెర తీస్తుంది.  తాను ఇండియాకు వద్దామని అనుకున్న వేళ.. అనుకోని రీతిలో ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నట్లుగా చెప్పి.. కొంత డబ్బు సర్దుబాటు చేయాలని కోరుతుంది. కోరుకున్న డబ్బు అందినంతనే కాంటాక్ట్ కట్ చేసేది. తాజాగా ఒక కుటుంబం ఆమె బారిన పడి రూ.5లక్షలు పోగొట్టుకున్నారు. అనంతరం సైబర్ పోలీసుల్ని ఆశ్రయించగా..ఈ కిలేడీ ఆట కట్టించి అరెస్టు చేశారు. సో.. ఇలాంటి కిలేడీ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.