Begin typing your search above and press return to search.

ఐసీయూ బెడ్ కావాలా?... రూ.1.30 ల‌క్ష‌లు రెడీ చేసుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   10 May 2021 3:10 AM GMT
ఐసీయూ బెడ్ కావాలా?... రూ.1.30 ల‌క్ష‌లు రెడీ చేసుకోవాల్సిందే
X
క‌రోనా విల‌య‌తాండం న‌యా దందాల‌కు తెర తీస్తోంది. క‌రోనా తొలి విడ‌త విల‌యంలో వైద్య చికిత్స‌ల‌కు భారీ రేట్ల‌ను వ‌సూలు చేసిన ప్రైవేటు ఆసుప‌త్రుల దందా వెలుగులోకి వ‌స్తే... క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో మ‌రింత కొత్త కొత్త దందాలు వెలుగు చూస్తున్నాయి. క‌రోనా సోకిన ఓ బాధితురాలికి ప్రైవేటు ఆసుప‌త్రిలో ఐసీయూ బెడ్ కోసం ఏకంగా రూ.1.30 ల‌క్ష‌లు డిమాండ్ చేయ‌డం, ఈ దందాలో స‌ద‌రు ప్రైవేటు ఆసుప‌త్రి యాజ‌మాన్యం కంటే కూడా ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో న‌ర్సుగా ప‌నిచేస్తున్న ఓ వ్య‌క్తి కీల‌కంగా మారిన వైనం క‌ల‌క‌లం రేపుతోంది. రాజ‌స్థాన్ లోని జైసూర్ లో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌లో రంగంలోకి దిగిన అవినీతి నిరోధ‌క శాఖ స‌ద‌రు న‌ర్సును అరెస్ట్ చేయ‌డంతో పాటు ఈ దందాలో ఓ ప్ర‌భుత్వ వైద్యుడి పాత్ర‌ను కూడా నిర్ధారించే ప‌నిలో ప‌డింది. ప్రైవేట్ ఆసుప‌త్రిలో కేవ‌లం ఐసీయూ బెడ్ కేటాయింపు కోస‌మే రూ.1.30 ల‌క్ష‌లు డిమాండ్ చేస్తే... ఇక చికిత్సకు మ‌రెంత గుంజి ఉంటార‌న్న విష‌యం ఆస‌క్తి రేపుతోంది. ఇంత చేసినా స‌ద‌రు బాధితురాలిని ఆమె భ‌ర్త కాపాడుకోలేక‌పోయారు.

ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకి వెళితే... జైపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఐసీయూ బెడ్‌ను రూ. 1.30 లక్షలకు విక్రయించిన ఓ మేల్ నర్సును అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ఓ వైద్యుడు, మేల్ నర్స్ ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యవసర చికిత్స అవసరమయ్యే కొవిడ్ రోగులకు వీరు ఆసుపత్రిలో బెడ్లను విక్రయిస్తున్నట్టు గుర్తించారు. తాజా అరెస్ట్‌తో ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ వ్యవహారం మరోమారు చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆసుపత్రికి చెందిన ఓ మేల్ నర్స్ తనకు ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని ఐసీయూ బెడ్‌ను రూ. 1.30 లక్షలకు విక్రయించినట్టు అశోక్ గుర్జార్ అనే బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. తన భార్య ఐసీయూలో చేరడానికి ముందు లంచం డబ్బులో రూ. 95 వేలను చెల్లించినట్టు చెప్పాడు. బుధవారం చేరిన ఆమె 48 గంటల చికిత్స తర్వాత శుక్రవారం మరణించిందని పేర్కొన్నాడు.

అయినప్పటికీ వదలని మేల్ నర్స్ మిగతా రూ.35 వేల కోసం ఫోన్ చేస్తూ ఇబ్బంది పెట్టాడు. దీంతో అశోక్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఆదివారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అశోక్ నుంచి రూ. 23 వేల లంచం తీసుకుంటుండగా మేల్ న‌ర్సును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు, ఇతర సిబ్బందితో నిందితుడికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో పనిచేస్తున్న ఓ వైద్యుడికి కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం లంచం సొమ్ములో అతడు రూ. 50 వేలు తీసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.