Begin typing your search above and press return to search.

చంద్రబాబు సెంటిమెంట్ అస్త్రం పనిచేస్తుందా?

By:  Tupaki Desk   |   14 Jan 2021 11:29 AM GMT
చంద్రబాబు సెంటిమెంట్ అస్త్రం పనిచేస్తుందా?
X
అభివృద్ధి అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే అభివృద్ధి అనేంతగా టీడీపీ అధినేత ప్రచారం చేసుకున్నారు. హైదరాబాద్ కట్టింది నేనే.. హైదరాబాద్ కు ఐటీని పరిచయం చేసింది నేనేనని చంద్రబాబు ఎన్నో గొప్పలు చెప్పుకున్నారు. ఇక టీడీపీ మీడియా కూడా గొప్పలు చెప్పుకుంటూ ఇన్నాళ్లు కాలం గడిపింది. కానీ దీన్ని ప్రజలు నమ్మకపోగా ఇదే గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు మైనస్ గా మారింది.

అయితే తాజాగా సంక్రాంతి వేళ చంద్రబాబు మాటలు బూమరాంగ్ అయ్యాయి. గతంలో తాను చేసిన అభివృద్ధిని గుర్తుచేసేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వీటిని టీడీపీ అనుకూల మీడియా కూడా హైలెట్ చేయడంతో చంద్రబాబు వ్యూహం మారిందని అర్థమవుతోంది.

గతంలో అభివృద్ధి పేరుతో ఓట్లడిగిన చంద్రబాబు.. తిరిగి అభివృద్ధి చేయడమే తప్పయితే క్షమించండి అంటూ సంక్రాంతి రోజు జనాన్ని వేడుకున్నారు. తద్వారా తన పాత అజెండా అలాగే ఉందని చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చంద్రబాబు ప్రజల్లో ఓ విషయాన్ని బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. తాను అభివృద్ధి చేయడం తప్పయితే క్షమించాలని జనాన్ని కోరుతున్నారు. గత ఏడాది కాలంలోనే పలుమార్లు క్షమాపణలు చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి వేళ మరోసారి అభివృద్ధి చేయడం తప్పయితే క్షమించాలని వేడుకున్నారు. దీంతో తన అభివృద్ధి అజెండాను క్షమాపణల రూపంలో జనంలోకి బలంగా తీసుకెళ్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

మరి తిరుపతి ఉప ఎన్నికలల నేపథ్యంలో చంద్రబాబు తీసుకొచ్చిన ఈ కొత్త అస్త్రం ప్రజల్లో ఆయనకు సానుభూతి తీసుకొస్తుందా? అభివృద్ధి మంత్రం పనిచేస్తుందా అన్నది వేచిచూడాలి.