Begin typing your search above and press return to search.

‘మా ప్రాణాలను కాపాడండి’

By:  Tupaki Desk   |   28 Nov 2021 2:30 AM GMT
‘మా ప్రాణాలను కాపాడండి’
X
చేసిన పనులకు బిల్లులు విడుదల కాక.. అమలాపురం మున్సిపల్ కాంటాక్టర్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని పెట్టుకున్న అర్జీలన్నీ బుట్టదాఖలవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటివరకు వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో బహిరంగంగా తమ కష్టాలను చెప్పుకునేందుకు సిద్థమయ్యారు.
ప్రభుత్వంపై నమ్మకంతో ఇంతకాలం నిధులు మంజూరు కాకపోయిన పనులు చేస్తూ వస్తున్న కాంట్రాక్టర్లు తమ పనులకు నిధులు మంజూరు కాక నానా అవస్థలూ పడుతున్నారు. పెండింగ్‌ లో ఉన్న బిల్లులు మంజూరు చేయాలంటూ ప్రభుత్వానికి ఎన్ని సార్లు నివేదించినా ఫలితం లేకపోవడంతో ప్రస్తుతం కాంట్రాక్టర్లు బహిరంగంగానే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోషకులుగా ఉండే వాళ్లం ఇప్పుడు యాచకులమయ్యామని వేడుకోవడం మొదలెట్టారు.

‘‘మా బిల్లులు చెల్లించండి.. మా ప్రాణాలు కాపాడండి’’ అంటూ అమలాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. అమలాపురం మున్సిపల్ కాంట్రాక్టర్లు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. చావే మాకు గతి అంటూ మున్సిపల్ కాంట్రాక్టర్లు అమలాపురం మున్సిపల్ కార్యాలయ వద్ద పోస్టర్లు అతికించారు. పెండింగ్‌లో ఉన్న పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని అధికారులను కోరారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పలుచోట్ల ప్లెక్సీలు కట్టారు. అధికారులు వెంటనే స్పందించి బిల్లులు చెల్లించి తమ ప్రాణాలను కాపాడాలని వేడుకున్నారు.

నాడు పోషకులం నేడు యాచకులం అంటూ ఫెక్సీలు పెట్టారు. శనివారం మున్సిపల్ సమావేశం జరుగుతున్న సందర్భంగా తమ గోడు, మున్సిపల్ కార్పోరేటర్లు, అధికారులకు తెలియాలని ఇలా నిరసన తెలిపారు. చావే గతి అంటూ మున్సిపల్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. మునిసిపాలిటీలో పలువురు కాంట్రాక్టర్లు లక్షల రూపాయలు ఖర్చు చేసి పనులు చేశారు. ఇప్పుడు చేసిన పనికి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు తెచ్చి మరీ పలువురు పనులు చేశామని వాపోతున్నారు.

బిల్లులు రాక, వడ్డీలు పెరిగి, చితికిపోతున్నామని, కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తమ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు వారి గోడును పోస్టర్ల రూపంలో వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడం, కోర్టు మెట్లెక్కడం తదితర రూపాల్లో నిరసనలు వ్యక్తం చేయడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు సరికొత్తగా మున్సిపల్ కార్యాలయంలో ఫ్లెక్సీలు వేయడం చర్చనీయాంశంగా మారింది.