మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా సత్య నాదెళ్ల.. విశ్వ యవనికపై తెలుగు వెలుగు!

Thu Jun 17 2021 14:00:03 GMT+0530 (IST)

Satya Nadella as Chairman of Microsoft

తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సత్యనాదెళ్ల మరో ఘనత సాధించారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈవోగా కొనసాగుతున్న ఆయన.. తాజాగా ఆ సంస్థ చైర్మన్ గా నియమితులయ్యారు. 2014 నుంచి సీవోగా కొనసాగుతున్న ఆయన.. ఇప్పుడు ఏకంగా చైర్మన్ గా బాధ్యతలు తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సత్య నాదెళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.2014లో అప్పటి చైర్మన్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పకున్న తర్వాత థామ్సన్ పగ్గాలు స్వీకరించారు. ఇప్పుడు థామ్సన్ నుంచి సత్య నాదెళ్ల చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. మైక్రో సాఫ్ట్ లో అంచెలంచెలుగా ఎదిగిన సత్య.. చైర్మన్ సీట్లో కూర్చోవడం పట్ల ప్రవాస భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మైక్రో సాఫ్ట్ నుంచి బిల్ గేట్స్ సలహాదారు బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. ఇప్పుడు ఆయనకు మైక్రోసాఫ్ట్ తో ఏ విధమైన సంబంధాలు లేవు. ఇది జరిగి సరిగ్గా ఏడాది అవుతోంది. ఈ నేపథ్యంలో బోర్డులో ప్రక్షాళన మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే.. చైర్మన్ ను కూడా మార్చారు. ఇప్పటి వరకు చైర్మన్ స్థానంలో ఉన్న థామ్సన్ ను స్వతంత్ర డైరెక్టర్ నియమించారు.

సత్య నాదెళ్ల స్వగ్రామం ఏపీలోని అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం బుక్కాపురం. ఆయన తండ్రి యుగంధర్ 1962 బ్యాచ్ కు చెందిన ఏఐఎస్ అధికారి. 2004 నుంచి 2009 వరకు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రణాళికా సంఘం సభ్యునిగా ప్రధాన మంత్రి కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన ఐఏఎస్ అయిన తర్వాత హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. 1967లో జన్మించిన సత్య నాదెళ్ల.. ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్ లోనే సాగింది. ఆ తర్వాత అమెరికా వెళ్లిన ఆయన.. మైక్రోసాఫ్ట్ లో చేరి ఇప్పుడు ఏకంగా చైర్మన్ కావడం.. తెలుగు వారికి గర్వకారణం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.