Begin typing your search above and press return to search.

కన్నాకు కన్నం పెడుతున్న జూనియర్ కోడెల

By:  Tupaki Desk   |   2 Jun 2023 10:28 PM GMT
కన్నాకు కన్నం పెడుతున్న జూనియర్ కోడెల
X
కోడెల శివ ప్రసాద్ గుంటూరు జిల్లాలో తిరుగులేని నాయకుడు. ఆయనకు రాజకీయాలు బహు దూరం. మంచి డాక్టర్ గా పల్నాడు ప్రాంతంలో ఎంతో గుర్తింపు ఉన్న వారు. 1983లో ఎన్టీయార్ పార్టీని పెట్టినపుడు తటస్థులను యువకులను విద్యావంతులను పార్టీలోకి తీసుకున్నారు. అలా కోడెల టీడీపీలో చేరారు. నర్సారావుపేట నుంచి ఆయన అయిదు సార్లు వరసగా గెలిచి రికార్డు సృష్టించారు.

ఇక ఎన్టీయార్ మంత్రివర్గంలో కీలకమైన హోం శాఖను కోడెల నిర్వహించారు. చంద్రబాబు హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పంచాయతీ శాఖ మంత్రిగా సమర్ధంగా పనిచేశారు. ఇక 2004లో ఆయన నర్సారావుపేటలో తొలిసారి ఓటమి పాలు అయ్యారు. 2009లో అదే జరిగింది.

విభజన ఏపీలో సత్తెనపల్లికి షిఫ్ట్ అయిన కోడెల ఆరవ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి వస్తుందని ఆశిస్తే చంద్రబాబు ఆయన్ని స్పీకర్ గా చేశారు. అయిదేళ్ల పాటు ఆయన సమర్ధంగా తనకు అప్పగించిన పదవిని నిర్వహించారు 2019లో వైసీపీ తరఫున అంబటి రాంబాబు పోటీ చేసి కోడెలను ఓడించారు. 2019 సెంప్టెంబర్ లో కోడెల ఆత్మహత్య చేసుకుని మరణించారు.

ఇదిలా ఉంటే కోడెల రాజకీయ వారసత్వం కోసం కూతురు, కొడుకు మధ్య ఆయన బతికున్న రోజుల్లోనే పోరు నడిచింది అని ప్రచారంలో ఉంది. ఇక కోడెల స్పీకర్ గా ఉన్న టైం లో కోడెల శివరాం సత్తెనపల్లిలో డీఫ్యాక్టో ఎమ్మెల్యేగా వ్యవహరించారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఏమి జరిగిందో ఏమో కానీ కోడెల ఓడాక బాబుతో గ్యాప్ పెరిగింది అని అంటారు ఆయన మరణం తరువాత శివరాం తో కూడా అదే దూరం ఉందని అంటారు.

వచ్చే ఎన్నికల్లో తనకు సత్తెనపల్లి టికెట్ ఇవ్వమని కోడెల శివరాం గట్టిగా కోరుతున్నారు. తండ్రి సీటు కాబట్టి ఆయన డిమాండ్ చేస్తున్నారు ఇక కోడెల స్పీకర్ గా ఉన్నపుడు శివరామే సత్తెనపల్లిలో చక్రం తిప్పేవారు కాబట్టి ఆ విధంగా పలుకుబడి కొంత ఉంది. దీంతో తనకే టికెట్ అని పట్టుబడుతున్నారు. ఈ నేపధ్యంలో సడెన్ గా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ఆ సీటుని చంద్రబాబు అప్పగించారు.

దానికి కారణ కన్నా బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడు. కాపులు అక్కడ ఎక్కువగా ఉన్నారు. పైగా 2009లో నియోజకవర్గాల విభజనలో కన్నా సొంత సీటు పెదకూరపాడులో చాలా భాగం సత్తెనపల్లిలో కలిసింది అని అంటున్నారు. దాంతో కన్నాకే బాబు ఓకే చెప్పారు మరో వైపు చంద్రబాబు జూనియర్ కోడెలకు టికెట్ ఇవ్వాలని ఎపుడూ అనుకోలేదని అంటున్నారు. ప్రయత్నం అయితే కోడెల కుమారుడు చేసుకుంటూవచ్చారు.

మాజీ స్పీకర్ కుమారుడిగా లోకల్ గా ఆయనకంటూ ఒక వర్గం బలం, బలగం ఉన్నాయి. అవి ఎన్నికల్లో గెలవడానికి సరిపోతాయా లేదా అన్న విషయం పక్కన పెడితే కన్నా లక్ష్మీనారాయణను ఓడించడానికి మాత్రం పనికొస్తాయని అంటున్నారు. నిజానికి కన్నాకు బాబు ఏమీ హాట్ కేక్ లాంటి సీటు ఇవ్వలేదు. సత్తెనపల్లి టీడీపీకి టఫ్ సీటు.

కేవలం మూడంటే మూడు సార్లు మాత్రమే అక్కడ టీడీపీ గెలిచింది. అలాంటి చోట అన్ని విధాలుగా బలవంతుడు అయిన కన్నా నెగ్గుకురాగలరని భావించే చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అయితే కోడెల శివరాం ఎక్కడా తగ్గడంలేదు. వరసబెట్టి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తన ఆగ్రహాన్ని వెదజల్లుతున్నారు.

అదే టైం లో గత మూడు రోజులుగా తన అనుచరులతో తీవ్ర స్థాయిలో చర్చలు మంతనాలు జరుపుతున్నారు. మరి కోడెల ఏమి చేయాలనుకుంటున్నారు అన్నది తెలియడంలేదు. అయితే ఆయన ఒక డిమాండ్ ముందు పెడుతున్నారు. కీలక నేతలు చనిపోయిన సీట్లలో వారసులకు టికెట్లు ఇస్తున్న టీడీపీ కోడెల కుటుంబానికి ఎందుకు అన్యాయం చేస్తోందని నిలదీస్తున్నారు.

పార్టీలు మారి వచ్చిన వారికి టికెట్లు ఇస్తారా అని కన్నా మీద ఇండైరెక్ట్ గా దాడి చేస్తున్నారు. చంద్రబాబుని కలవనీయకుండా పార్టీలోని కొందరు చేస్తున్నారు అని కూడా అంటున్నారు ఇదిలా ఉంటే శివరాం ని బుజ్జగించడానికి తెలుగుదేశం అధినాయకత్వం త్రీ మెన్ కమిటీని ఆయన వద్దకు పంపించించింది. తొందరలోనే బాబు శివరాం కి అపాయింట్మెంట్ ఇస్తారని కూడా చెబుతున్నారు. మరి బాబు వద్ద జూనియర్ కోడెల ఏమి అడుగుతారో ఆయన ఏ హామీ ఇస్తారో చూడాలి. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇవ్వవచ్చు అని అంటున్నారు.

అయినా జూనియర్ కోడెల మెత్తబడతారా అన్నది చూడాలి. ఇక ఏ హామీ ఇచ్చినా కన్నాకు గ్రౌండ్ లెవెల్ లో జూనియర్ కోడెల నుంచి సహకారం ఎంతవరకు ఉంటుంది అన్నది ప్రశ్నగానే ఉంది. అసలే టఫ్ సీటు, ఇపుడు జూనియర్ కోడెల కన్నాలు పెడితే కన్నాకు సత్తెనపల్లి రాజకేయం సక్సెస్ ని ఇస్తుందా అన్నది చూడాలని అంటున్నారు.