సత్తెనపల్లి జిల్లా కేంద్రంగా సాధ్యం కాదు

Sat Jan 29 2022 17:00:01 GMT+0530 (India Standard Time)

Sattanapalli is not possible as the district headquarters

ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ప్రకటనపై అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. ప్రజలు విపక్షాల నుంచే కాకుండా అధికార వైసీపీ నాయకుల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26కు పెంచేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఉగాది నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి కొత్త జిల్లాల నుంచి కార్యకలాపాలు మొదలెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కానీ కొన్ని జిల్లాల పేర్ల విషయంలో జిల్లా కేంద్రాల ఎంపికలో మండలాల విలీనం తదితర విషయాల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ నేతలు కూడా కొన్ని అంశాల్లో అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. ఇక సొంత పార్టీ నేతలు కూడా కొన్ని విషయాలపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.అయితే కొత్త జిల్లాలపై ఉన్న అభ్యంతరాలను 30 రోజుల్లోగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తే తగిన మార్పులు చేసే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల పునర్విభజనపై సత్తెనపల్లె వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. పెదకూరపాడు నియోజకవర్గాన్ని గురజాల రెవెన్యూ డివిజన్లో కలపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే నంబూరుతో కలిసి ఈ విషయాన్ని సీఎంవో దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. 30 రోజుల్లో వినతిపత్రం అందజేస్తే పరిశీలిస్తామని సీఎంవో అధికారులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు.

అంతే కాకుండా తమ నియోజకవర్గ ప్రజలు కూడా సత్తెనపల్లెని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతున్నారని అంబటి రాంబాబు అన్నారు. కానీ అది సాధ్యం కాదని ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని తెలిపారు. నరసరావుపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించడమే సరైన నిర్ణయమని పేర్కొన్నారు. సత్తెనపల్లి పెదకూరపాడును కలిపి రెవెన్యూ డివిజన్ చేయాలని రాంబాబు కోరారు. మరోవైపు నంద్యాలకు దివంగత నేత భూమా నాగిరెడ్డి పేరు పెట్టాలని ఆయన తనయ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ డిమాండ్కు టీడీపీ నేతలు కూడా పూర్తిస్థాయిలో మద్దతునిస్తున్నారు.

అంతేకాకుండా విజయవాడకు దివంగత వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాను రెండుగా విడగొట్టి విజయవాడకు స్వర్గీయ  ఎన్టీఆర్ పేరు పెట్టారు. కానీ కృష్ణాకు ఎన్టీఆర్ విజయవాడకు రంగా పేర్లు పెట్టాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.