Begin typing your search above and press return to search.

సల్మాన్ రష్దీ రాసిన శటానిక్ వర్సెస్ లో ఏముంది? ఎందుకంత వివాదాస్పదం?

By:  Tupaki Desk   |   13 Aug 2022 5:05 AM GMT
సల్మాన్ రష్దీ రాసిన శటానిక్ వర్సెస్ లో ఏముంది? ఎందుకంత వివాదాస్పదం?
X
భారత్ లో పుట్టి బ్రిటన్ లో పెరిగిన అంగ్ల రచయిత సల్మాన్ రష్దీ. బ్రిటన్ లో స్థిరపడిన తర్వాత అతను రాసిన పుస్తకాల్లో మిడ్ నైట్ చిల్డ్రన్ బుక్ తో ఆయన ఫేమస్ అయ్యారు. ఈ పుస్తకం ఒక్క బ్రిటన్ లోనే పది లక్షల కాపీలు అమ్ముడు కావటం గమనార్హం. ఆయన రాసిన నాలుగో పుస్తకమే ‘శటానిక్ వర్సెస్’. ముస్లిం వర్గాల్లో ఈ పుస్తకం పెను దుమారమే రేపింది. ఈ పుస్తకాన్ని కొందరు దైవద్రోహంగా అభివర్ణిస్తారు.

ఈ పుస్తకంపై వ్యక్తులు మాత్రమే కాదు దేశాలు సైతం తీవ్రంగా మండిపడ్డాయి. ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా ఆ పుస్తకాన్ని బ్యాన్ చేశాయి. ఈ పుస్తకాన్ని రాసిన సల్మాన్ రష్దీపై ఇరాన్ అత్యున్నత నాయకుడిగా పేరున్న అయతొల్లా ఖొమేనీ డెత్ ఫత్వా జారీ చేయటం గమనార్హం. అంతేకాదు.. రష్దీని చంపేస్తే రూ.4.77 కోట్ల బహుమానం ఇస్తామంటూ ప్రకటనలు ఇరాన్ లో వచ్చాయి. అయితే.. అయతొల్లా అలీ ఖొమేనీ మాత్రం సల్మాన్ రష్ధీ తలకు పెట్టిన ఖరీదు రూ.23.89 కోట్లు. అది కూడా 1989లో ఆయన డెత్ ఫత్వా జారీ చేసిన వేళలో.. ఈ భారీ మొత్తాన్ని పేర్కొన్నారు.

ఇంతకీ ఈ పుస్తకం ఎందుకు ఇంత వివాదాస్పదమైంది? ఎందుకింత ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇందులో ఏముంది? ముస్లింల మనోభావాలు అంతలా దెబ్బ తినేలా సల్మాన్ ఏం రాశారు? అన్న విషయానికి సంబంధించిన సమాచారం వెతికితే.. పెద్దగా కనిపించని పరిస్థితి. అందులో ఏముందన్న విషయం కంటే కూడా.. అందులో వివాదాస్పదమైన విషయాలకు సంబంధించిన కొన్ని వివరాలు మాత్రమే ఉండటం గమనార్హం.

ఈ పుస్తకంలో ముస్లింల మతగ్రంధమైన ఖురాన్ కు సంబంధించిన కొన్ని అంశాల్ని ప్రస్తావించారు. ఖురాన్ లో చేర్చటానికి నిరాకరించిన కొన్ని వచనాలను తన పుస్తకంలో సల్మాన్ వివరించారు. ముగ్గురు దేవతలను పూజించటానికి అనుమతి ఉందని రాసి ఉందని.. ఆ దేవతల పేర్లు అల్లాత్.. ఉజ్జా.. మనాత్ గా పేర్కొన్నారు. ముస్లింలు నిరాకరించిన ప్రవచనాల్ని బయపెట్టినందుకే అతడ్ని అంతమొందించాలన్న ఫత్వా జారీ చేసినట్లుగా చెబుతారు.

సమస్య ఏమంటే.. ముస్లింలు అల్లాహ్ తప్పించి మరే దేవుడు లేరని విశ్వసిస్తారు. బైబిల్ లో ఎలా అయితే కొన్ని అంశాల్ని బయటకు రాకుండా చేశారో.. ఖురాన్ లోనూ ఇప్పటివారు నిరాకరించిన కొన్ని ప్రవచనలు ఉన్నాయన్నది వాదన. పురాతన ముస్లిం చరిత్రకారులు రాసిన నిజాల్ని ఈకాలం ముస్లిం పండితులు నమ్మకపోవటం.. అందులోని అంశాల్ని సల్మాన్ రష్ధీ తన శటానిక్ వర్సెస్ పుస్తకంలో ప్రస్తావించటంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పుస్తకం గురించి గూగుల్ లో విపరీతంగా వెతికినప్పుడు.. ఈ పుస్తకంపై 1997లో మిసిమి పత్రికలో ప్రచురితమైన ఒక రివ్యూ ఉంది.

శటానిక్ వర్సస్ రచన మీద మరింత అవగాహన కల్పించేందుకు ఈ పాత రివ్యూ కాస్త సాయం చేసే వీలుంది. అందుకే.. అప్పట్లో మిసిమీలో పబ్లిష్ అయిన విషయాన్ని యథాతధంగా ఇక్కడ ఇస్తున్నాం. సాహిత్యం గురించి చక్కటి వ్యాసాలు రాసే సాహితీ ప్రచురణగా మిసిమి సుపరిచితం. దీన్ని రిఫరెన్సుగా చూసేందుకు సాయం చేస్తుంది. ఇంతకీ మిసిమీలో అప్పట్లో ఏం రాశారంటే.. ‘‘పాశ్చాత్య దేశాలలో ముస్లింల పట్ల, ఇస్లాం, ఖురాన్ గురించి రాజీధోరణిలో ప్రవర్తించడం వలన, ప్రజాస్వామ్యవిలువల పట్ల రాజీపడినట్లయిందని రచయిత హెచ్చరించారు. స్వేచ్ఛకూ, ఇది లేని వారికీ పోరాటం జరుగుతుందనీ, 21వ శతాబ్దంలో ముందుకు పోవాలంటే స్వేచ్ఛతో కూడిన, ప్రజాస్వామిక మానవ హక్కులు పాటించాలని రచయిత అంటున్నారు.

సాల్మన్ రష్డీ శటానిక్ వర్సెస్ వంటిది కాదీ పుస్తకం. ఒక ముస్లిం పండితుడు ప్రజాస్వామిక, స్వేచ్ఛా పిపాసిగా ఆక్రందనతో రాసిన పుస్తకం యిది. అయితే ముస్లింలలో వున్న అసమానం దృష్ట్యా యీ రచనకు సుప్రసిద్ధ హ్యూమనిస్ట్ ప్రచురణ సంస్థ అమెరికాలో చేబట్టింది. బహుశ ఇస్లాం గురించి యింత విపులంగా, సమగ్రంగా యిటీవల ఏ రచనా వెలువడలేదేమో.

భారత దేశంలో హమీద్ దల్వాయ్, ఎ.బి.షా వంటి వారు చేసిన రచనలు చాలా మందిని ఆలోచింపజేశాయి. ఈ రచన బహుళ ప్రచారంలోకి వస్తే యింకా కళ్ళు తెరుస్తారు. ఖురాన్ గురించి కూలంకషంగా చర్చించిన అనంతరం, సుమారు 6 వేల సురా సూత్రాలతో కూడిన ఖురాన్ ను రోజూ ముస్లిం పిల్లలకు నూరిపోసి, కంఠస్తం చేయించడం కూడా రచయిత ప్రస్తావించారు.
- మిసిమి మాసపత్రిక, ఏప్రిల్-1997’’