Begin typing your search above and press return to search.

డబుల్స్ లో సానియా శకాంతం.. మరో టెన్నిస్ తార ఉద్భమమెప్పుడో..?

By:  Tupaki Desk   |   23 Jan 2023 4:41 PM GMT
డబుల్స్ లో సానియా శకాంతం.. మరో టెన్నిస్ తార ఉద్భమమెప్పుడో..?
X
భారత టెన్నిస్ లో ఓ శకం ముగిసింది. పురుషుల టెన్నిస్ లో లియాండర్ పేస్-మహేశ్ భూపతి రాజ్యమేలుతున్న కాలంలో దూసుకొచ్చి.. అమ్మాయిలూ టెన్నిస్ లో రాణించగలరని నిరూపించి.. భారత మహిళలూ గ్రాండ్ స్లామ్ నెగ్గగలరని చాటిచెప్పిన హైదరాబాదీ సానియా మీర్జా మరిక మనకు మైదానంలో కనిపించదు. భారత మహిళల టెన్నిస్ కే ధ్రువ తారగా వెలుగొందిన సానియా.. ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో పరాజయం పాలైంది. కాగా, సానియా ఇప్పటికే టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ నెల 16 నుంచి జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ తనకు చివరి గ్రాండ్ స్లామ్ అంటూ స్పష్టం చేసింది. వచ్చే నెలలో జరగనున్న దుబాయ్ మాస్టర్స్ తర్వాత పూర్తిగా రిటైర్ కానుంది. అయితే, టెన్నిస్ లో గ్రాండ్ స్లామ్ కొలమానం.

అందులో ఆడితేనే గుర్తింపు. ఈ లెక్కన దుబాయ్ మాస్టర్స్ లో సానియా పాల్గొన్నా..పాల్గొనకపోయినా పెద్దగా ప్రభావం ఉండదు. మరోవైపు తన చివరి గ్రాండ్ స్లామ్ అయిన ఆస్ట్రేలియా ఓపెన్ లో సానియా రోహన్ బోపన్నతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో కూడా ఆడుతున్నారు. ఆ లెక్కన చివరి గ్రాండ్ స్లామ్ లో ఆమె పతకం ఆశలు సజీవంగానే ఉన్నాయి.నా సర్ స్కూల్.. హైదరాబాదీ ఎగువ ముస్లిం మధ్య తరగతి కుటుంబానికి చెందిన సానియా మీర్జా.. అంతర్జాతీయ స్థాయికి ఎదగడం అద్భుతంగానే చెప్పాలి. నాసర్‌ స్కూల్‌కు చెందిన ఆరేళ్ల బాలిక తన టెన్నిస్‌ నెరవేర్చుకోవడం.. దేశానికి ప్రాతినిధ్యం వహించడం.. ఎందరికో స్ఫూర్తిగా నిలవడం ఓ చరిత్ర. ఆ విషయాలను ఆమె తన రిటైర్మెంట్ ప్రకటన రోజున భావోద్వేగంతో పేర్కొంది. 50 పైగా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ప్రాతినిధ్యం వహించిన సానియా గెలిచిన కొన్ని టైటిళ్లు దేవుడిచ్చిన వరమంది. 'నా సుదీర్ఘ కెరీర్‌లో దేశానికి పతకాలు తేవడమే అతిపెద్ద గౌరవంగా భావిస్తాను. పతకం నా మెడలో పడినపుడు జాతీయ పతాకం రెపరెపలాడినపుడు కలిగే ఆనందం అన్నింటికి మించి ఉంటుంది. ఇప్పుడు దీన్ని తలచుకొని రిటైర్మెంట్‌ సందేశం రాస్తున్నప్పుడు చెరిగిపోని ఆ అనుభూతి నా కళ్లను చెమరుస్తోంది' అని తెలిపింది.

ఫామ్ తగ్గి.. ఫిట్ నెస్ ఆలోచించి సానియా వయసు ప్రస్తుతం 36 ఏళ్లు. ఆమె గ్రాండ్‌స్లామ్‌ ప్రయాణం 2005లో ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌తోనే మొదలైంది. విశేషమేమంటే.. ఇప్పుడు చివరి గ్రాండ్‌స్లామ్‌ కూడా అదే.దీన్ని తలచుకుంటూ ''18 ఏళ్ల క్రితం ఎక్కడైతే ఆరంభించానో అక్కడే ఆపేయబోతున్నా. ఇక కెరీర్‌లో చివరి టోర్నీ మాత్రం దుబాయ్‌ ఓపెన్‌.ఫిబ్రవరిలో ఈ టోరీ్నతో సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతాను. ఇన్నేళ్ల పయనంలో ఎన్నో ఆటుపోట్లే కాదు మరెన్నో మధురస్మృతులూ ఉన్నాయి' అని పేర్కొంది. నంబర్ వన్ అయి నిరూపించింది టెన్నిస్ లో భారత మహిళలు గ్రాండ్ స్లామ్ గడప తొక్కుతారా? అనుకుంటున్న సమయంలో హైదరాబాదీ సానియా ఆ అంచనాలను అందుకుంది.

మహిళల డబుల్స్‌లో ఓ దశలో నెంబర్‌ వన్‌ అయింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌ టైటిళ్లను కూడా గెలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌,యూఎస్‌ ఓపెన్‌ టైటిల్స్‌ నెగ్గింది. అయితే, ఒలింపిక్ పతకం త్రుటిలో చేజారింది. 2016 రియో ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సెమీఫైనల్లో ఆమె జంట ఓడింది.

మిక్స్ డ్ లో మనోడితోనే ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ లో సానియా ఆట ముగిసినా, మిక్స్ డ్ డబుల్స్ లో మాత్రం ఇంకా అవకాశాలున్నాయి. భారతీయుడైన రోహన్‌ బోపన్నతో కలిసి సానియా నేడు (సోమవారం) రెండో రౌండ్ ఆడనుంది. కాగా, సానియా టెన్నిస్ రాకెట్ చేతబట్టి 30 ఏళ్లు. ప్రొఫెషనల్ గా మారి 20 ఏళ్లు. ఇప్పుడు కెరీర్లో చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీ చివరి మెట్టుపై ఉంది.దేశభక్తికి అడ్డురాని వివాహ బంధం సానియా మీర్జా 2010లో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహమాడింది. దీనిపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. కానీ, సద్దుమణిగాయి. వీరికి ఒక బాబు.

ఇక సానియా-షోయబ్ జంట విడిపోనున్నట్లు కొద్ది రోజులుగా విపరీతమైన ప్రచారం జరిగింది. ఆ సమయంలోనే దుబాయ్ లో ఉంటున్న వీరు కుమారుడు ఇజ్హాన్ పుట్టిన రోజు వేడుకలను దుబాయ్‌లో ఘనంగా జరిపారు. ఆ తర్వాత షోయబ్ మాలిక్ సానియాను మోసం చేశాడనే వార్తలు పాకిస్థాన్ మీడియాలో గుప్పుమన్నాయి.

షోయబ్ ఓ షో షూటింగ్‌లో ఉండగా ఈ వార్తలు దావానలంలా వ్యాపించాయి. కాగా, పాకిస్థానీని వివాహమాడినప్పటికీ సానియా భారతీయురాలిగానే చెప్పుకొంది. దేశభక్తి విషయంలో తన నిబద్ధతను శంకించాల్సిన అవసరం లేదని తన ప్రకటనల ద్వారా చాటిచెప్పింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.