బెజవాడలో గ్యాంగ్ వార్: వెలుగులోకి సందీప్ - పండు దందాలు

Tue Jun 02 2020 22:00:10 GMT+0530 (IST)

Gang war in Bejawada: Sandeep and Pandu rowdisiam

బెజవాడలో మరోసారి గ్యాంగ్ వార్ బుసలు కొట్టింది. అప్పుడెప్పుడో వంగవీటి రంగా రాధా నెహ్రూ హయాంలో పెచ్చరిల్లిన రౌడీయిజం తాజాగా మరోసారి బయటపడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చుట్టు అల్లుకున్న ఈ దందాలు వెలుగుచూశాయి.తాజాగా విజయవాడలోని డొంకరోడ్డులో గ్యాంగ్ వార్ జరిగింది. ఈ ఘర్షణలో తోట సందీప్ కేటీఎం పండుల గ్యాంగ్ లు ఘర్షణ పడ్డారు. రాళ్లు రువ్వుతూ.. కత్తులు తిప్పుతూ దాదాపు 20మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతి ఒక్కరిపైన రౌడీషీట్ తెరుస్తున్నారు. ఈ ఘటనలో చికిత్స పొందుతూ తోట సందీప్ మరణించాడు. ఈ నేపథ్యంలో వీరిపై పోలీసులు దర్యాప్తు జరపగా.. నేర చరిత్ర బయటపడింది.

కేటీఎం పండుపై మూడు కేసులు సందీప్ పై 13 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. పండు గ్యాంగ్ సాగించిన కార్యకలాపాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు.

గ్యాంగ్ స్టర్ సందీప్ మరణంతో ఆస్పత్రికి భారీగా అభిమానులు వస్తారని పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. ఆస్పత్రిని ఆధీనంలోకి తీసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి నేరుగా స్వస్థలానికి తరలించారు.

గ్యాంగ్ స్టర్ సందీప్ మరణంతో ఆయన భార్య తేజస్విని రాజకీయాల్లో దింపాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. వీఎంసీ ఎన్నికల్లో మూడో డివిజన్ టీడీపీ అభ్యర్థిగా నిలపాలని భావించినా ఆమెకు ఓటు హక్కు లేకపోవడంతో మరో అభ్యర్థిని దించబోతున్నారట..

ఇక సందీప్ ను చంపిన పండు దందాలు వెలుగుచూశాయి. ఇంటిపన్ను పెంచినందుకు పంచాయతీ కార్యదర్శిపై పండు దాడి చేసినట్లు సమాచారం. చాలా రోజుల తర్వాత బెజవాడలో మళ్లీ గ్యాంగులు ఘర్షణకు దిగడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.