టీడీపీ గెలుపుపై సజ్జల వారి భాష్యం ఇదే!

Sat Mar 18 2023 18:50:42 GMT+0530 (India Standard Time)

Sajjala responded to the results of the graduate MLC elections

రాష్ట్రంలో మూడు ప్రాంతాలు.. మూడు గ్రాడ్యుయేట్ స్థానాలు. 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిదిలోని 10 లక్షల మంది గ్రాడ్యు యేట్ ఓటర్లు.. ఇవన్నీ.. చిన్న విషయాలా?  వీరు ఇచ్చిన తీర్పు..(టీడీపీకి అనుకూలంగా) చిన్నదా? అంటే.. టీడీపీ నేతలు మాత్రం చాలా పెద్దదని.. వైసీపీకి ఆ పార్టీ అధినేత సీఎం జగన్కు చెంపపెట్టు వంటిదని చెబుతున్నారు.అదే సమయంలో పాలనపై విసిగెత్తిపోయిన విద్యావంతులు తమ ఓటు ద్వారా.. సరైన తీర్పు ఇచ్చారని చెబుతున్నారు. అంతేకాదు.. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇది నాందీ ప్రస్తావన అవుతుందని కూడా అంటున్నారు.

కట్ చేస్తే.. ఇదే ఫలితంపై .. వైసీపీ నేతలు ఎలా రియాక్టవుతున్నారంటే.. దీనిని చాలా చిన్నదిగానే తాము చూస్తున్నట్టు చెబు తున్నారు. వైసీపీ ముఖ్య నాయకుడు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై స్పందించారు.

ఈ ఎన్నికలను చిన్నవిగా ఆయన కొట్టిపారేశారు. సమాజంలోని అన్ని వర్గాల మనోభావాలను ఇది ప్రతిబింబించదన్నారు. అంతేకాదు.. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎక్కడో తేడా జరిగిందని తాము భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. దీనిని టీడీపీ బలంగానో .. టీడీపీ పుంజుకున్నట్టుగానో చూడాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు.

ఆయా నియోజకవర్గాల్లో జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుని కమ్యూనిస్టులను కలుపుకొని వెళ్లిన కారణంగానే.. గెలుపు గుర్రం ఎక్కిందని సజ్జల తేల్చి చెప్పారు. అయితే.. తాము ఈ విషయంపై మరింత లోతుగా అధ్యయనం చేసి.. నిర్ణయం తీసుకుంటామ న్నారు. అవసరమైతే.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

వైసీపీ పాలనలో జనం సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు.. ప్రస్తుతం జరిగిన ఎన్నికలకు మధ్య ఎక్కడా పొంతన లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని.. చెప్పారు. మొత్తానికి ఓడిన చోట ఆత్మప రిశీలన చేసుకుంటామని మాత్రం సజ్జల వారు చెప్పకపోవడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.