Begin typing your search above and press return to search.

మోడీ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టిన రూమర్

By:  Tupaki Desk   |   20 Aug 2019 4:38 AM GMT
మోడీ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టిన రూమర్
X
వెనుకా ముందు చూసుకోకుండా.. మాట్లాడేసే నేతలు కొందరే ఉంటారు. అందునా ఈ తీరుతో ఉండే మహిళా నేతలు చాలా తక్కువ. అందుకే ఫైర్ బ్రాండ్ మహిళా నేతలకు గుర్తింపు చాలా త్వరగా వస్తుంది. అదే సమయంలో వారిపై విరుచుకుపడే వారూ.. విమర్శలతో ఉతికి ఆరేసే వారూ ఎక్కువగానే ఉంటారు. నిన్నమొన్నటి వరకూ టీడీపీ ఫైర్ బ్రాండ్ గా.. హార్డ్ కోర్ చంద్రబాబును అభిమానించే నాయకురాలిగా యామిని సాధినేని సుపరిచితురాలు.

ఇటీవల జరిగిన ఎన్నికల వేళలో పార్టీ ప్రత్యర్థులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయాలంటే యామిని పేరే ప్రముఖంగా వినిపించేది. విమర్శల్ని లెక్క చేయకుండా.. ప్రత్యర్థుల్ని ఎంత మాట పడితే అంత మాటను జస్ట్ లైక్ దట్ అన్నట్లుగా అనేసే యామినికి టీడీపీలో భారీ ఫాలోయింగే ఉంది. ఛానళ్లు నిర్వహించే డిబేట్స్ లోనూ.. సోషల్ మీడియాలోనూ ఆమె చెలరేగిపోతుంటారు.

ఆమె మాటలు.. విడుదల చేసే వీడియోలతో అతి తక్కువ వ్యవధిలోనే ఆమె తెలుగు రాజకీయాల్లో సెలబ్రిటీగా మారిపోయారు. చిన్నా.. పెద్దా నేతల్నే కాదు చివరకు ప్రధాని మోడీని సైతం అనరాని మాటల్ని అనేసిన ఆమె తీరు సంచలనంగా ఉండేది. మే 23 తర్వాత హిమాలయాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండు మోడీ.. మోడీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్న విమర్శలు యామిని నోటి దురుసుకు నిలువెత్తు నిదర్శనంగా చెప్పాలి.

అలాంటి యామిని ఇప్పుడు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసిన వార్త ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు సంచలనంగా మారింది. అయితే.. యామిని పార్టీలోకి వస్తుందన్న మాటకు మోడీ అభిమానులు సుతారమూ ఇష్టపడటం లేదు. తమ ఆరాధ్యదైవాన్ని నోటికి వచ్చినట్లుగా తిట్టేసిన యామిని లాంటి వారిని పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏముందన్న మాటను వారు చెబుతున్నారు.

ఎంత రాజకీయ ప్రయోజనం అయితే మాత్రం.. పరుషంగా విమర్శలు చేసిన వారిని పార్టీలో చేర్చుకోవటం ద్వారా.. మిగిలిన పార్టీలకు తమకు ఏ మాత్రం తేడా లేకుండా పోతుందన్న మాట మోడీ అభిమానుల్లో వినిపిస్తోంది. పార్టీలోకి ఆమె ఎంట్రీ ఇవ్వనున్నారన్న మాట మోడీ అభిమానుల్ని తెగ ఇబ్బంది పెట్టేస్తుందట. నిజమే.. ఎవరూ అనని మాటల్ని అనేసిన యామిని పార్టీలోకి వచ్చి.. మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడే మాటల్ని జీర్ణించుకోవటం వినే వారికే కాదు.. ఆమెకు కూడా ఇబ్బందేనని చెప్పక తప్పదు.