సచిన్ చాలా క్యూట్ అనిపించి.. ఎయిర్ పోర్టులో అతడి వెంటపడ్డా.. కానీ!

Thu Jun 10 2021 15:00:01 GMT+0530 (IST)

Sachin looked very cute .. chased him at the airport .. but!

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలను ఆయన సతీమణి అంజలి వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తొలిసారి సచిన్ ను చూసిన అనుభవాలను నెమరువేసుకున్నారు. మొదటిసారిగా ఆయనను ఎయిర్ పోర్టులో చూశానని తెలిపారు. అంతేకాదు సచిన్ అంటూ ఆయన వెంట పడినట్లు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో సచిన్ చాలా ఇబ్బంది పడ్డారని నవ్వుకున్నారు.ఇంగ్లాండ్ పర్యటన అనంతరం స్వదేశానికి వచ్చిన క్రికెట్ జట్టులో సచిన్ చాలా క్యూట్ గా అనిపించారని పేర్కొన్నారు. 17 ఏళ్ల ఆయన 12 ఏళ్ల పిల్లాడి లాగా ఉన్నారని తెలిపారు. తను వాళ్ల అమ్మకోసం ఎయిర్ పోర్టులో ఎదురుచూస్తున్న సమయంలో సచిన్ కనిపించారని అంజలి అన్నారు. అప్పటికి సచిన్ గురించి తనకు తెలియదని చెప్పారు. సచిన్ ప్రత్యేకతను తన ఫ్రెండ్ అపర్ణ వివరించిందని గుర్తు చేసుకున్నారు.

అతిచిన్న వయసులో సెంచరీ కొట్టిన వ్యక్తి సచిన్ అని చెప్పినట్లు పేర్కొన్నారు. కానీ క్రికెట్ మీద పెద్దగా ఆసక్తి లేని తాను అవన్నీ పట్టించుకోలేదని వివరించారు. ఆయన ఏదైతే ఏంటి అనుకున్నానని అన్నారు. కానీ సచిన్ క్యూట్ నెస్ వల్ల చూడగానే చాలా నచ్చాడని చెప్పారు. ఇక అమ్మ గురించి మర్చిపోయి సచిన్ అంటూ వెంట పరిగెత్తినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో సచిన్ చాలా ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఈ అమ్మాయి నా వెంట పడుతోంది ఏంటని కనీసం చూడకుండా కారు ఎక్కారని వెల్లడించారు. అలా తొలిరోజు అనుభవాలను అంజలి గుర్తు చేసుకున్నారు.

ఆ తర్వాత కామన్ ఫ్రెండ్ ద్వారా వారి పరిచయం పెరిగిందని తెలిపారు. అది కాస్త ప్రేమగా మారి 1995లో వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరికి అర్జున్ సారా అనే ఇద్దరు పిల్లలున్నారు. 1989నుంచి 24 ఏళ్ల పాటు సుధీర్ఘంగా బ్యాట్ ను రఫ్పాడించి మైదానంలో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. అతర్జాతీయ క్రికెట్ లో 100 సెంచరీలు చేసిన ఘటన ఈయనకే దక్కింది. వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్ గా రికార్డు సృష్టించారు. క్రికెట్ లో ఎన్నో రికార్డులను నమోదు చేసిన సచిన్ ప్రస్థానం భారత క్రికెట్ చరిత్రలో సుస్థిరం.