Begin typing your search above and press return to search.

ఆప్ కు ఎస్ఎస్ఎం గండం తప్పదా ?

By:  Tupaki Desk   |   19 Jan 2022 4:18 AM GMT
ఆప్ కు ఎస్ఎస్ఎం గండం తప్పదా ?
X
పంజాబ్ లో తమకు ఎదురేలేదని అనుకుంటున్న ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)కు సంయుక్త సమాజ్ మోర్చ (ఎస్ఎస్ఎం) రూపంలో పెద్ద గండమొచ్చి పడింది. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు పోరాటాలు చేసిన రైతుసంఘాల్లో 22 సంఘాలు కలిసి ఎస్ఎస్ఎంగా ఏర్పడి మొదటిసారి ఎన్నికల్లో పాల్గొంటోంది. పంజాబ్ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపుతామని మోర్చా సవాలు విసరుతోంది.

పంజాబ్ ప్రధానంగా వ్యవసాయ రాష్ట్రమని అందరికీ తెలిసిందే. అందులోను గ్రామీణ ప్రాంతాలంతా దాదాపు వ్యవసాయం మీదే ఆధారపడ్డాయి. ఇపుడు కొత్తగా ఏర్పాటైన మోర్చా దృష్టి గ్రామీణ ప్రాంతాల మీదే పెట్టింది. దాంతో బలమైన రైంతాంగం ఓట్లు చీలిపోయే ప్రమాదం వచ్చింది. ఇదే విషయాన్ని ఆప్ కూడా అంగీకరిస్తోంది. నిజానికి పంజాబ్ మొత్తంమీద భారతీయ కిసాన్ సంఘ్ చాలా పెద్దది. ఇది గనుక ఎన్నికల్లో పోటీచేస్తే రైంతాంగం ఓట్లలో అత్యధికం దానికే పడే అవకాశముంది.

అయితే కిసాన్ సంఘ్ ఎన్నికలకు దూరంగా ఉంది. కాబట్టే తాను రంగంలోకి దిగినట్లు సంయుక్త సమాజ్ మోర్చా చెబుతోంది. దీంతో రైతాంగం ఓట్లు ఈ మోర్చాకు పడే అవకాశముందని అంచనాలు పెరుగుతున్నాయి. ఓట్ల చీలికను నివారించేందుకు మోర్చా అగ్రనేత బల్బీర్ సింగ్ రాజేవాల కూడా పోటీలో ఉన్నారు. రాజేవాలతో ఢిల్లీలో కేజ్రీవాల్ పొత్తు చర్చలు కూడా జరిపారు. అయితే మోర్చాకు 60 సీట్లడిగారట రాజేవాల. దాంతో పొత్తులు కుదరలేదని స్వయంగా కేజ్రీవాలే చెప్పారు.

రాజేవాల తమతో పొత్తు చర్చలకు వచ్చేటప్పటికే 90 శాతం టికెట్లను ప్రకటించిన విషయాన్ని చెప్పినట్లు కేజ్రీవాల్ చెప్పారు. మిగిలిన సీట్ల 20 సీట్లు మోర్చాకు ఇస్తామని ప్రతిపాదించామన్నారు. ఇప్పటికే ప్రకటించిన 90 శాతం టికెట్లు కూడా రైతు బిడ్డలకే ఇచ్చినట్లు కూడా తాను చెప్పిన విషయాన్ని కేజ్రీవాల్ చెప్పారు. అయితే అందుకు రాజేవాల అంగీకరించలేదన్నారు. దీనివల్లే పొత్తు చర్చలు ఫెయిలైందన్నారు.

పంజాబ్ లో 20 శాతం తటస్తుల ఓట్లపై తాము దృష్టి పెట్టినట్లు కేజ్రీవాల్ చెప్పారు. ఇపుడు మోర్చా కూడా దానిపైనే కన్నేసిన కారణంగా ఓట్లలో చీలిక ఖాయమన్నారు. మోర్చా చివరి నిముషంలో ఎంట్రీ కారణంగా తమకు గ్రామీణ ప్రాంతాల్లో, తటస్తుల ఓట్లలో చీలిక వస్తే నష్టపోతామని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తంచేశారు. మరి ఎన్నికల్లో మోర్చా ప్రభావం ఎంతుంటుందో ఇప్పటికేమీ తెలీటం లేదు.