Begin typing your search above and press return to search.

దిశ హంతకుల స్వైరవిహారం..ఐసీయూలో ఎస్సై - కానిస్టేబుల్

By:  Tupaki Desk   |   6 Dec 2019 2:54 PM GMT
దిశ హంతకుల స్వైరవిహారం..ఐసీయూలో ఎస్సై - కానిస్టేబుల్
X
తెలుగు నేలలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెను కలకలం రేపిన దిశ హత్యాచారం ఘటనలో నిందితులుగా తేలిన నలుగురు దుర్మార్గులు చివరి దాకా తప్పించుకునే యత్నం చేశారని చెప్పక తప్పదు. ఓ వైపు దిశ హత్యాచారం ఘటనతో తమ కుటుంబాల్లోని తమకు వ్యతిరేక పవనాలు వీస్తున్నా... నిందితుల ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. అంతేకాకుండా ఏకంగా తమను అరెస్ట్ చేసిన పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చివరి దాకా నిందితులు చేసిన యత్నం చూస్తుంటే... ఈ దుర్మార్గులను ఎన్ కౌంటర్ లో పోలీసులు మట్టుబెట్టడం కరెక్టేనన్న వాదన వినిపిస్తోంది. పోలీసుల నుంచి తప్పించుకునే యత్నంలో నిందితులు బరితెగించి వ్యవహరించిన ఘటనలో ఓ ఎస్సైతో పాటు మరో కానిస్టేబుల్ ఆసుపత్రిపాలయ్యారు.

ఈ వివరాల్లోకి వెళితే... దిశ కేసులో నిందితులుగా తేలిన నలుగురు నిందితులను పోలీసులు నేరం జరిగిన తీరును తెలుసుకునేందుకు శుక్రవారం తెల్లవారుజామున నేరం జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో దిశకు చెందిన మొబైల్, వాచీలను దాచిపెట్టిన ప్రదేశాలను తెలిపే క్రమంలో అక్కడ, ఇక్కడ అంటూ పోలీసులను నిందితులు ఏమార్చారు. అదే క్రమంలో అదను చూసుకుని పోలీసులపై దాడి చేసి తప్పించుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులపై రాళ్లతో, కర్రలతో దాడికి దిగారు. అంతటితో ఆగకుండా పోలీసుల దగ్గర నుంచి రెండు తుపాకులను లాక్కొని కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో నందిగామ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్‌గౌడ్‌ లకు గాయాలయ్యాయి. తప్పించుకునేందుకు యత్నించడంతో నిందితులను కాల్చేసిన పోలీసులు.. ఆ తర్వాత నిందితుల దాడిలో గాయపడ్డ ఎస్సై, కానిస్టేబుల్ లను కేర్ ఆసుపత్రికి తరలించారు.

ఎస్సై, కానిస్టేబుల్ లను ఐసీయూకు తరలించిన కేర్ వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. నిందితుల దాడిలో గాయపడ్డ వారిద్దరికి ఎలాంటి గాయాలయ్యాయన్న విషయంపై ఆసుపత్రి వైద్యులు ఓ బులెటిన్ ను విడుదల చేశారు. ఈ బులెటిన్ ప్రకారం... ఎస్సైకి తల మీద గాయం కాగా.. కానిస్టేబుల్ కుడి భుజంపై కర్రతో కొట్టిన గాయాలు ఉన్నాయట. ప్రస్తుతం ఆ ఇద్దరికీ ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని.. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేర్ వైద్యులు వెల్లడించారు. మొత్తంగా దిశను అమానుషంగా హతమార్చిన నిందితులు అరెస్టైన తర్వాత కూడా ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా పోలీసులపైనే దాడి చేసి పరారు అయ్యేందుకు యత్నించడం, వారి దాడిలో ఎస్సై - కానిస్టేబుల్ కు గాయాలు అయిన వైనం జనానికి మరింత కోపం తెప్పించిందనే చెప్పాలి.