Begin typing your search above and press return to search.

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ కు రూ.వెయ్యి కోట్ల పరువునష్టం కేసు షాక్

By:  Tupaki Desk   |   30 May 2023 10:43 AM GMT
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ కు రూ.వెయ్యి కోట్ల పరువునష్టం కేసు షాక్
X
30 ఏళ్ల పాటు అవుటర్ రింగ్ రోడ్డు లీజు కు సంబంధించిన ఇష్యూలో బీజేపీ ఫైర్ బ్రాండ్ కమ్ ఎమ్మెల్యే రఘనందన్ రావు పై రూ.వెయ్యి కోట్ల పరువునష్టం దావా వేస్తూ లీగల్ నోటీసు పంపిన వైనం సంచలనంగా మారింది. అవుటర్ రింగు రోడ్డు లీజు కు సంబంధించిన బిడ్ ను 'ఐఆర్ బీ ఇన్ ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్' దక్కించుకోవటం తెలిసిందే. తమపై బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు సత్యదూరమైన ఆరోపణలు చేసినట్లుగా పేర్కొంది.

మే 25న మీడియాలో రఘునందన్ రావు మాట్లాడుతూ.. అవుటర్ రింగు రోడ్డు లీజు కు వ్యతిరేకంగా ఉద్యమం చేసే వారిని ఐఆర్ బీ సంస్థ చంపేస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఈ ఆరోపణలో ఎలాంటి నిజం లేదని.. బాధ్యతారాహిత్యంతో.. నిరాధారమూన ఆరోపణలు చేసినట్లుగా సదరు సంస్థ వెల్లడించింది. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్ని పూర్తిగా తప్పుదోవ పట్టించటంతో పాటు ఐఆర్ బీ సంస్థ ప్రతిష్ఠను దెబ్బ తీసేలాచేస్తున్నట్లుగా పేర్కొంది.

గతంలో జరిగిన ఆర్టీఏ కార్యకర్త హత్యకేసులో ఐఆర్ బీ సంస్థ కు ఎలాంటి సంబంధం లేదని.. పుణె సెషన్స్ కోర్టు.. ముంబయి హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చాయని స్పష్టం చేసింది. ఈ వాస్తవాల ను తెలుసుకోకుండా సంస్థ పరువు ను దెబ్బ తీసేలా రఘునందన్ రావు మాట్లాడారని చెప్పింది. అంతేకాదు.. ఐఆర్ బీ ఇన్ ఫ్రాను బ్లాక్ లిస్టులో పెట్టారనే వ్యాఖ్యలు కూడా పూర్తిగి నిరాధారమైనవని వెల్లడించింది.

పలు జాతీయ ప్రాజెక్టు ల్లో ఐఆర్ బీ పెట్టుబడి భాగస్వామిగా ఉందని.. ఎక్కడా బ్లాక్ లిస్టులో పెట్టలేదని చెప్పిన సంస్థ.. వాస్తవాలు తెలీకుండా మాట్లాడినట్లుగా పేర్కొంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయటంతో తమ సంస్థ పరువు కు తీవ్ర భంగం వాటిల్లిందని.. అందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అదేంటే రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం కింద చెల్లించాలని చెప్పింది.

లేని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి. అవుటర్ రింగు రోడ్డు 30 ఏళ్ల లీజు పై ఐఆర్ బీ సంస్థపై టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేయటం.. ఆయన పైనా పరువునష్టం దావాకు సంబంధించిన నోటీసుల్ని పంపటం తెలిసిందే.