Begin typing your search above and press return to search.

రోహిత్ ను వదలని పెళ్లి మూడ్.. వైజాగ్ అభిమానికి ప్రపోజల్

By:  Tupaki Desk   |   20 March 2023 6:44 PM GMT
రోహిత్ ను వదలని పెళ్లి మూడ్.. వైజాగ్ అభిమానికి ప్రపోజల్
X
టీమిండియా లో అత్యంత సరదాగా ఉండే వ్యక్తి ఎవరంటే హార్దిక్ పాండ్యా అనో.. అత్యంత హుషారుగా ఉండేది ఎవరంటే విరాట్ కోహ్లి అనో చెప్పొచ్చు.. ఇక శిఖర్ ధావన్ ఉన్న సమయంలో అతడూ చాలా చలాకీగా కనిపించేవాడు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ ఎలా ఉంటాడనేది ఎవరికీ తెలియదు. మైదానం లో కూల్ గా కనపించే రోహిత్ బయట కాస్త సీరియస్ గానే ప్రవర్తిస్తాడని అనుకుంటారు. అయితే, అతడిలోనూ కాస్త కొంటెతనం ఉందని తెలిసింది. అదికూడా చిలిపిదనంతో కూడినదని స్పష్టమైంది. అది కూడా ఓ తెలుగు అభిమాని విషయంలో కావడం విశేషం.

రెండో వన్డేకు వచ్చి.. భారత్ -ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే కు విశాఖ పట్టణం ఆతిథ్యం ఇచ్చింది. గతంలో మన జట్టుకు ఎన్నో తీపి గుర్తులు ఉన్న ఈ నగరంలో ఈ ఆదివారం మాత్రం చేదు గుర్తే మిగిలింది. టీమిండియా ఘోర ఓటమిని చవిచూడమే దీనికి కారణం. మన జట్టు అన్ని విభాగాల్లో విఫలమై.. 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా పై ఓడిపోయింది. ఇక వ్యక్తిగత కారణాలతో ముంబైలో జరిగిన తొలి వన్డే కు కెప్టెన్ రోహిత్‌ అందుబాటులో లేడు. విశాఖ మ్యాచ్ కు జట్టుతో చేరాడు. జట్టు సభ్యులతో కలిసి వైజాగ్‌ విమానాశ్రయంలో దిగాడు. కాగా, విమానాశ్రయంలో అతడికి సాదర స్వాగతం లభించింది. అయితే, ఓ అభిమాని అదే పనిగా వీడియో తీస్తుండడాన్ని రోహిత్ గమనించాడు. అతడికి సరదా ప్రపోజల్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

పెళ్లి నుంచి వచ్చి పెళ్లి ప్రపోజల్.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అభిమానులతో సరదాగా ఉంటాడు. వారిపై తన ప్రేమను చూపిస్తాడు. ఇలాంటి ఘటనే వైజాగ్‌ లో చోటుచేసుకుంది. ఓ అభిమానికి హిట్‌మ్యాన్‌ సరదాగా ప్రేమ ప్రతిపాదన చేశాడు. పువ్వు ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటావా..? అని అడిగాడు. అసలేం జరిగిందంటే.. విమానాశ్రయం నుంచి ఆటగాళ్లంతా బయటకు వస్తుండగా.. ఓ అభిమాని వారిని ఫాలో అవుతూ.. ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీశాడు. ఇంతలో అతడి వద్దకు రోహిత్‌ వచ్చి.. తన వద్ద ఉన్న గులాబీని ఇచ్చాడు. 'తీసుకో.. ఇది నీ కోసమే.. నన్ను పెళ్లి చేసుకుంటావా..'

అని సరదాగా అడిగాడు. రోహిత్‌ తనను పలకరించినందుకు సంతోషించిన ఆ అభిమాని.. ఆ ప్రపోజల్‌కు మాత్రం కాస్త షాక్‌ అయినట్లు కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకూ రోహిత్ తొలి వన్డేకు దూరమైన కారణమూ వివాహమే కావడం విశేషం. రోహిత్ భార్య రితిక సోదరుడి వివాహం కారణంగా రోహిత్ తొలి మ్యాచ్ కు అందుబాటులో లేడు. పెళ్లి తర్వాత జరిగిన విందులో రోహిత్ డ్యాన్స్ కూడా చేశాడు. అంటే.. పెళ్లి నుంచి వస్తూ.. అదే మూడ్ లో పెళ్లి ప్రపోజల్ చేశాడన్నమాట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.