Begin typing your search above and press return to search.

నిలువెత్తు ఆత్మవిశ్వాసమే.. నమ్మకం కోల్పోయిన వేళ

By:  Tupaki Desk   |   17 March 2023 10:00 PM GMT
నిలువెత్తు ఆత్మవిశ్వాసమే.. నమ్మకం కోల్పోయిన వేళ
X
ఎప్పుడు జరిగిందో.. ఏ మ్యాచ్ సందర్భంగా జరిగిందో కానీ.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరులతో మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంగా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి లో ఆత్మవిశ్వాసం లోపించడం గురించి విలేకరులు ప్రశ్నించారు. దీనికి రోహిత్ నుంచి.. ''ఏ మాట్లాడుతున్నారు మీరు.. కోహ్లి ఆత్మవిశ్వాసం గురించి మాట్లడాడడమా?'' అని సమాధానం వచ్చింది. అయితే, ఈ జవాబు చెప్పేటపుడు రోహిత్ ముఖంలోని హావభావాలను చూస్తే.. 'ఓరి పిచ్చోల్లారా.. ఏం అడుగుతున్నారు?' అన్నట్లుగా ఉన్నాయి. కోహ్లి ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపమనే భావనలో రోహిత్ సమాధానం ఇచ్చాడు.

నిజమే.. పోతపోసిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్

అది 2006 డిసెంబరు 19.. ఢిల్లీలో కోహ్లి తండ్రి గుండెపోటు చనిపోయాడు. అప్పటికి విరాట్ వయసు 17. ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. ఓవర్ నైట్ స్కోరు 40. జట్టు ఫాలో ఆన్ లో ఉంది. విరాట్ మైదానంలో దిగేప్పటికి తండ్రిని కోల్పోయిన విషయం తెలిసింది. అయినా గుండెనిబ్బరంతో మ్యాచ్ ఆడిన అతడు 90 పరుగులతో తన జట్టును ఫాలో ఆన్ తప్పించాడు. అలా మొదలైన అతడు మరో 15 నెలల్లోపే అండర్ 19 కెప్టెన్ గా టైటిల్ అందుకున్నాడు. మరో నాలుగు నెలల్లోనే టీమిండియాలోకీ వచ్చేశాడు.

ఈ క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. 2010-11 మధ్యలో వేటుకు గురయ్యాడు. మళ్లీ వచ్చి పాతుకుపోయాడు. స్టార్ బ్యాటర్ గా కీర్తి శిఖరాలను అందుకున్నాడు. మూడు ఫార్మాట్లకూ కెప్టెన్ అయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారథ్యం సహా ఏడాది కిందట అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. దీనివెనుక బీసీసీఐ చీఫ్ గా ఉన్న సౌరభ్ గంగూలీతో విభేదాలు ఉండడం వేరే సంగతి.

ఐపీఎల్ గెలవని ఆర్సీబీ.. కర్ణుడి శాపాలు..

ఐపీఎల్ లో కోహ్లి మొదటినుంచి ఆర్సీబీకి ఆడుతున్నాడు. 15 ఏళ్ల లీగ్ చరిత్రలో ఇప్పటివరకు జట్టు మారనిది అతడొక్కడే కావడం విశేషం. అయితే, ఆర్సీబీ ఆప్పటివరకు టైటిల్ మాత్రం కొట్టలేకపోయింది. కర్ణుడి చావుకు ఉన్నట్లు దీనికి అనేక కారణాలున్నాయి. ఇలా ఎందుకు చెప్పాలంటే.. టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నుంచి మొదలు కోహ్లి వరకు ఎందరో స్టార్లు ఆర్సీబీకి ఆడారు. పేర్లు చెప్పుకొంటూ పోతే.. జాక్వస్ కలిస్, మిస్బావుల్ హక్, రాస్ టేలర్, స్టెయిన్, జహీర్ ఖాన్, ఏబీ డివిలియర్స్, మిషెల్ స్టార్క్ ఇలా ఒకరేమిటి..? గ్లెన్ మ్యాక్స్ వెల్ సహా ఎందరో? కానీ, బెంగళూరుకు మాత్రం టైటిల్ కల తీరలేదు.

ఒక్క ఏడాదే 970 పరుగులు

2016.. బెంగళూరు ఐపీఎల్ టైటిల్ కు అత్యంత చేరువగా వచ్చిన సందర్భం. ఆ సీజన్ లో కోహ్లి ఆత్మవిశ్వాస విశ్వరూపమే చూపాడు. నాలుగు సెంచరీలు సహా 973 పరుగులు చేశాడు. కానీ, కేవలం 8 పరుగుల తేడాతో ఫైనల్లో సన్ రైజర్స్ చేతిలో ఓడిపోయింది. కోహ్లి, డివిలియర్స్, గేల్ రాణించినా ఇలా ఎన్నోసార్లు లీగ్ లో కీలక సమయంలో దెబ్బతిన్నది. కాగా, కోహ్లి నిరుడు టీమిండియా కెప్టెన్సీతో పాటు ఆర్సీబీ పగ్గాలు కూడా వదిలేసిన సంగతి తెలిసిందే. దీనిపై అతడు పెదవి విప్పాడు.

అప్పట్లో తనపై తనకే నమ్మకం లేదని, ఏమీ ఆలోచించలేకపోయానని అన్నాడు. మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో యూపీతో ఆర్‌సీబీ మ్యాచ్‌కు ముందు ఆ జట్టు క్రికెటర్లతో కోహ్లి మాట్లాడుతూ.. ''నిజాయతీగా చెప్పాలంటే.. కెప్టెన్‌గా పదవీకాలం చివరికి వచ్చేసరికి నాపై నాకే నమ్మకం లేదు. నా వల్ల కాలేదు. నా బుర్రలో అంతా శూన్యమే'' అని కోహ్లి అన్నాడు. ''కెప్టెన్సీ చాలా కష్టమనిపించింది. బాధ్యతలు నిర్వర్తించడం నా వల్ల కాలేదు. కానీ తర్వాతి సీజన్‌లో కొత్త వాళ్లు.. కొత్త ఆలోచనలతో వచ్చారు. గత మూడు సీజన్లలో మేం ప్లే ఆఫ్స్‌ చేరాం. సమష్టిగా ఆడటం వల్లనే ఇది సాధ్యం అయ్యింది. జట్టులో ఒకరు నిరాశలో ఉంటే.. వారిలో స్ఫూర్తి నింపాల్సిన బాధ్యత జట్టులో ప్రతి ఒక్కరిపై ఉంటుంది'' అని చెప్పాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.