Begin typing your search above and press return to search.

కర్ణాటక నేతలకు కొరుకుడుపడని ఇద్దరు తెలుగు సివంగులు

By:  Tupaki Desk   |   16 Jun 2021 1:30 AM GMT
కర్ణాటక నేతలకు కొరుకుడుపడని ఇద్దరు తెలుగు సివంగులు
X
నీతిగా.. నిజాయితీగా.. ముక్కుసూటిగా.. రూల్ బుక్ అంటే రూల్ బుక్ అన్నట్లుగా వ్యవహరించే ఐఏఎస్ అధికారుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతుందున్న విమర్శ ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. మంచి పోస్టింగ్ కోసంరాజీ పడటం.. అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా వ్యవహరించటం.. నీతిగా ఉన్నప్పటికీ విధి నిర్వహణ విషయంలో చూసిచూడనట్లుగా ఉండటం లాంటివి ఎక్కువ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఈ కల్చర్ ను పలువురు తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇందుకు భిన్నంగా తెలుగు ప్రాంతానికి చెందిన ఇద్దరు సివంగులు కన్నడనాట హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ఎంతకూ కొరుకుడుపడని వారి తీరుకు నేతలు హైరానా పడిపోతున్న పరిస్థితి. ఇంతకూ ఆ ఇద్దరు ఎవరో కాదు.. ఒకరు తరచూ వార్తల్లో కనిపించే రోహిణి సింధూరి అయితే.. మరొకరు ఆకురాతి పల్లవి.

ఈ ఇద్దరిలో చాలానే సారూప్యతలుకనిపిస్తాయి. ఇద్దరు తెలుగు వారే కావటం.. ఇద్దరూ ఒకే బ్యాచ్ కావటం.. ఇద్దరు ఐఏఎస్ క్యాడర్ తీసుకోవటం.. తెలుగు వారైనప్పటికి ఇద్దరూ కర్ణాటక రాష్ట్రాన్ని ఎంచుకోవటమే కాదు.. ముక్కుసూటిగా వ్యవహరించటం.. విధి నిర్వహణలో రాజీ పడకపోవటం.. ఎంత ఒత్తిడి అయినా సరే.. లైట్ తీసుకోవటమే తప్పించి వెనక్కి తగ్గటం మాత్రం వీరిలో కనిపించదు. అంతేకాదు.. వీరిద్దరూ సివిల్స్ కు ప్రిపేర్ అయ్యింది కూడా ఒకే ఇన్ స్టిట్యూట్ లో కావటం గమనార్హం.

అయితే.. రోహిణి సింధూరి మీడియాలో ఎక్కువగా కనిపిస్తారు కానీ పల్లవి చాలా తక్కువేనని చెప్పాలి. రోహిణి సింధూరి అన్నంతనే గూగులమ్మ బోలెడన్ని ఫోటోలు.. సమాచారాన్నిచూపిస్తుంటుంది. కానీ.. ఆకురాతి పల్లవి విషయంలో మాత్రం అంత ఎక్కువ సమాచారం లభించదు. పల్లవి ప్రత్యేకత ఏమంటే.. ఆమెకు తెలుగంటే చాలా ఇష్టం. స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతుంది.

రోహిణి సింధూరి విషయానికి వస్తే ఆమె ఇప్పటివరకు డజనుకు పైగా బదిలీలు ఎదుర్కొన్నారు. అవినీతి అంటేనే విరుచుకుపడటం.. ఎదురు ఉన్నది ఎవరన్నది చూసుకోకుండా విరుచుకుపడటం ఆమెకు అలవాటు. ఆమె పేరు వింటేనే.. రాజకీయ నేతలు మనకెందుకులే అన్నట్లుగా ఆమడ దూరాన ఉండిపోతారు. ఇటీవల ఆమెను మైసూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ హోదా నుంచి బదిలీ వేటు వేయటం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటమే కాదు.. ఆమెను తిరిగి ఆ పదవిని అప్పగించాలంటూ 1.50లక్షల మంది సంతకాలతో ఆన్ లైన్ పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతానికి 90వేల మంది సంతకాలు చేసి దన్నుగా నిలిచారు. ఆమె బయోపిక్ తీయాలన్న ఆలోచనలో కన్నడ నిర్మాతలు ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఆకురాతి పల్లవి కూడా తక్కువేం కాదు. ఆమెకు ఏ పోస్టింగ్ వేసినా అక్కడి అక్రమార్కులకు వణుకుపుట్టిస్తూ ఉంటారు. ఇప్పటివరకు దాదాపు పదికి పైనే బదిలీలు జరిగాయి. కర్ణాటక దేవాదాయ శాఖ కమిషనర్ గా పని చేసిన ఆమె.. నేతల కబ్జాలో ఉన్న రూ.100 కోట్ల విలువైన దేవుడి ఆస్తుల్ని ఆమె కాపాడారు. అనేక స్కాంల్ని ఛేదించటమేకాదు.. అడ్డుకోవటంలోనూ కీలకభూమిక పోషించారు. ఇద్దరు తెలుగు సివంగులు కన్నడ అవినీతి నేతలకు చెమటలు పట్టించటమే కాదు.. వారిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావటం లేదని వాపోవటం గమనార్హం.