దారుణం: తుపాకులతో నగరం నడిబొడ్డున బంగారం షాపు లూటీ

Sun Jun 26 2022 22:00:01 GMT+0530 (IST)

Robbery of a gold shop

దొంగలు ఒకప్పుడు ఎవరూ లేనిది చూసి అర్ధరాత్రి లూటీ చేసేవారు. కానీ ఇప్పుడు మరీ ముదిరిపోయారు. పట్టపగలు.. నగరం నడిబొడ్డున జనాలను ఏమాత్రం లెక్కచేయకుండా చోరీలు చేస్తున్నారు. చేతిలో తుపాకులు పట్టుకొని లూటీలకు పాల్పడుతున్నారు.గుంపులుగా దాడి చేసి దోచుకుంటున్నారు.ముఖ్యంగా బంగారం బ్యాంక్ లను టార్గెట్ గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా నగరంలో నడిబొడ్డున తుపాకులతో బంగారం షాపును లూటీ చేసిన దొంగల వీడియో వైరల్ గా మారింది. బీహార్ లోని హాజీపూర్ లో ఈ దారుణం జరిగింది.

హాజీపూర్ లో జూన్ 22న జరిగిన చోరీ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన రాత్రి 8 గంటల ప్రాంతంలో సుభాష్ మదాయి చౌక్ వద్ద జరిగింది. నీలం జ్యూవెల్లరీలో ఈ ఘటన జరిగింది.

సునీల్ ప్రియదర్శికి చెందిన బంగారం దుకాణంలో ఇది జరిగింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో కొంతమంది మాస్క్ లు ధరించి షాపులోకి ప్రవేశించారు. అప్పటికే షాప్ లో కొంతమంది కస్టమర్ లు ఉన్నారు. వెంటనే తుపాకులు తీసి అందరినీ బెదిరించారు. డబ్బులు బంగారం ఇచ్చేయాలని బెదిరించారు. షాపు యజమాని సునీల్ ప్రతిఘటించడంతో అతడిని చితకబాదారు. కాలితో తన్నుతూ.. తుపాకులతో కొడుతూ అమానుషంగా ప్రవర్తించారు. ఎంతకీ తగ్గకుండా దొంగలను ప్రతిఘఠించడంతో ఆ తర్వాత అతడిని కాల్చిచంపేశారు. దుకాణాన్ని దోచుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

షాపులో ఉన్న సీసీ కెమెరాలో దొంగతనానికి పాల్పడిన ఘటన రికార్డ్ అయ్యింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..