కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

Tue May 04 2021 17:00:02 GMT+0530 (IST)

Rewanth Reddy sensational allegations against KCR

భూకబ్జా ఆరోపణలతో ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించిన సీఎం కేసీఆర్ పై తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అదే భూకబ్జా ఆరోపణలు కేసీఆర్ కుటుంబంపై ఉన్నాయని ఆరోపించారు.దేవరయాంజాల్ సీతారామస్వామి ఆలయ భూముల్లో కేసీఆర్ కుటుంబం సన్నిహితుల భూములు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిషేధిత జాబితాలో ఉన్న 437 సర్వేలో మంత్రి కేటీఆర్ ఓ పత్రిక సీఎండీ దామోదర్ రావుకు భూములు ఉన్నాయని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

ఆరోపించడమే కాదు.. ఇందుకు సంబంధించిన సేల్ డీడ్ కాపీలను రేవంత్ రెడ్డి మీడియాకు చూపించారు. 95 ఏళ్లకు దేవరయాంజాల్ దేవాలయ భూముల వివరాలను బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

స్థానిక ఎంపీగా రికార్డులు జరిగిన లావాదేవీల గురించి వివరాలు అడిగితే ఇవ్వడం లేదని రేవంత్ ఆరోపించారు. ఈటలను ఎలాగైతే భూ కబ్జా ఆరోపణలతో తొలగించారో దేవరయాంజల్ భూముల్లో కూడా మంత్రులు కేటీఆర్ మల్లారెడ్డిల హస్తం ఉందని వారిని తప్పించాలని రేవంత్ ఆరోపించారు.

అధికార దుర్వినియోగానికి పాల్పడి దేవరయాంజల్ భూములు కొట్టేసిన కేటీఆర్ మల్లారెడ్డిలను తక్షణం తొలగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  బ్యాంకులను తప్పుదారి పట్టించారని.. దీనిపై సీబీఐ విచారణ జరపాలని కోరారు. దీన్ని ఇంతటితో ఊరుకోమని.. కేంద్రమంత్రులు అమిత్ షా కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.