కేసీఆర్ కు మాట చెప్పాలంటే చినజీయర్ ను వేడుకుంటే సరా?

Sun Apr 14 2019 10:49:54 GMT+0530 (IST)

Revenue Officials Meets Chinnajeeyar Swamy

కష్టం వస్తే గుడికి వెళతాం. దేవుడ్ని వేడుకుంటాం. సమస్య నుంచి బయటపడేయాలని కోరుకుంటాం. అవసరమైతే మొక్కులు కూడా మొక్కుతాం. అందుకు భిన్నంగా తెలంగాణలో చోటు చేసుకున్న పరిణామం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెవెన్యూ శాఖ ప్రక్షాళనపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత పట్టుదలగా ఉన్నారో తెలిసిందే.ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకునే దమ్ము.. ధైర్యం ఇప్పటి వరకూ ఎవరూ చేయలేదు. చేసిన వారంతా దారుణమైన అనుభవాలు ఎదురయ్యాయి. అలాంటి చరిత్ర తెలిసి మరీ.. రెవెన్యూ శాఖను మొత్తంగా మార్చేయాలన్న అంశంపై పట్టుదలగా ఉన్న కేసీఆర్ తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. సీఎం నిర్ణయంపై మొదట్లో ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేసిన రెవెన్యూ ఉద్యోగులకు.. తత్త్వం చాలా త్వరగానే అర్థమైనట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని ఆగ్రహంతో దారికి తెచ్చుకోలేమని.. కేవలం అభిమానాన్ని ప్రదర్శించటం ద్వారా మాత్రమే ఆయన మనసు దోచుకోవచ్చన్న విషయం రెవెన్యూ ఉద్యోగులకు తెలిసి వచ్చినట్లుంది.

అందుకే వారు రూటు మార్చారు. సమస్య వచ్చినప్పుడు చప్పున దేవుడు.. గుడి ఎలా గుర్తుకు వస్తుందో?  అదే రీతిలో కేసీఆర్ మహారాజు ఆగ్రహావేశాల్ని తగ్గించాలంటే ఉన్న మార్గాల్ని వెతికిన వారికి.. చినజీయర్ కు మించిన షార్ట్ కట్ మరేది కనిపించనట్టుంది. అందుకే.. రెవెన్యూశాఖకు చెందిన పెద్ద తలకాయలు చినజీయర్ స్వామి వారి దర్శనానికి వెళ్లారు.

అక్కడికి వెళ్లి స్వామివారికి చెప్పిందేమిటో తెలుసా?  ‘‘మా శాఖకు మంత్రి లేరు.. ముఖ్యమంత్రిని కలవలేం... అధికారులను కలుద్దామంటే సమయం ఇవ్వడం లేదు.. మా గోడును ఎవరికి చెప్పుకొనేది.. మీరే మా బాధను అర్థం చేసుకుని.. మా శాఖను కాపాడాలి’’ అని వేడుకోటం విశేషం.

చినజీయర్ స్వామి ఒక ఆశ్రమాన్ని నడుపుకునే అధ్యాత్మిక వేత్త. మరి.. అలాంటి ఆయన వద్దకు వచ్చి ఉద్యోగులు వేడుకోవటం వెనుక అసలు విషయం అర్థమైందిగా. కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన వారిలో మైహోం రామేశ్వరరావు.. స్వాములోరు చినజీయర్ ఉంటారు. చూస్తూ.. చూస్తూ ఒక వ్యాపారవేత్త వద్దకు వెళ్లి చేతులు కట్టుకోవటం బాగోదు. ఒకవేళ ఆ పని చేసినా.. ఫలితం ప్రతికూలంగా రావటం ఖాయం.

అందుకే.. ఉన్న వాటిల్లోకెల్లా ఉత్తమమైన మార్గం చినజీయర్ స్వామి వారిని వేడుకోవటం. ఆయన్ను సాయం చేయమని కోరటం. తాజాగా జరిగింది కూడా అదే. రెవెన్యూ శాఖను వేరే శాఖలో విలీనం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయని.. తమను కాపాడాలని వారు కోరటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

200 ఏళ్ల చరిత్ర ఉన్న రెవెన్యూ శాఖను రద్దు చేస్తామని.. కలెక్టర్ పేరునూ మారుస్తామని అంటున్నారని.. ప్రజలకు ఏ కష్టం వచ్చినా స్పందించేది తామేనిన.. నాలుగున్నరేళ్లుగా రేయింబవళ్లు పని చేస్తూ ప్రజలకు సేవలందిస్తున్న సేవా కార్యక్రమాల్ని వారు ఏకరువు పెట్టుకున్నారు. మరి.. దీనికి చినజీయర్ స్వామివారు ఇచ్చిన అభయం ఏమిటంటే.. మీకు ఎలాంటి ఇబ్బందులు రావని. మరి.. ఆయన అభయం ఎంతమేర ప్రభావితం చేస్తుందో చూడాలి.