Begin typing your search above and press return to search.

కవితను ఓడించి పగ తీర్చుకున్నారా? అంటే.. ఎంత ఒద్దికగా బదులిచ్చారంటే?

By:  Tupaki Desk   |   27 Sep 2020 8:30 AM GMT
కవితను ఓడించి పగ తీర్చుకున్నారా? అంటే.. ఎంత ఒద్దికగా బదులిచ్చారంటే?
X
కొందరు నేతలు ఎంత సెటిల్డ్ గా.. పరిపక్వతతో ఉంటారన్న విషయానికి నిదర్శనంగా తాజా ప్రశ్నకు సీనియర్ రాజకీయ నేత డి. శ్రీనివాస్ చెప్పిన సమాధానం నిదర్శనంగా చెప్పక తప్పదు. ఫస్ట్రేషన్ లో ఉన్న వేళ.. టెంప్టు చేసే ప్రశ్నను అడిగితే.. చెలరేగిపోయే నేతలకు భిన్నంగా డీఎస్ ఎంత జాగ్రత్తగా సమాధానం ఇచ్చిన తీరు.. చాలామంది నేతల్లో లేనిదేమిటన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.

ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన డీఎస్.. తెలంగాణ ఏర్పడిన తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ మాటలతో కారు ఎక్కిన వైనం తెలిసిందే. అనూహ్యంగా ఆ తర్వాత నుంచి ఆయన్ను పక్కన పెట్టేశారు.అయినప్పటికీ కేసీఆర్ మీద ఎంత కోపం ఉన్నా.. ఏమీ మాట్లాడకుండా.. తన టైం కోసం ఎదురుచూశారని చెప్పాలి. డీఎస్ ను పక్కన పెట్టటం ద్వారా కేసీఆర్ కు జరగాల్సిన డ్యామేజ్ జరిగిందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంటుంది.

తెలంగాణలో తిరుగులేని ఆయన.. తన కుమార్తెను ఎన్నికల్లో గెలిపించుకోని వైనం చూసినప్పుడు కేసీఆర్ ఓటమికి అతీతుడు కాదన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లైంది. ఈ ఓటమిలో డీఎస్ కీలకమని.. ఎందుకంటే.. ఆయన కుమారుడే విజయం సాధించారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అయినప్పటికి ఇలాంటి పొగడ్తలకు ఏ మాత్రం పొంగిపోని డీఎస్ చాలా జాగ్రత్తగా రియాక్టు అవుతుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయనకు ఆసక్తికర ప్రశ్న ఒకటి ఎదురైంది.

కవితను ఓడించి పగ తీర్చుకున్నారా? అని ప్రశ్నిస్తే.. తనకు అంత శక్తి ఉందని వారు (కేసీఆర్) వాళ్లు అర్థం చేసుకున్నారా? అని ప్రశ్నిస్తూ.. అక్కడున్న పరిస్థితుల కారణంగానే కవిత ఓడారని.. తన కుమారుడు అరవింద్ గెలిచినట్లుగా చెప్పుకొచ్చారు. గొప్పలు చెప్పుకునే అవకాశం వచ్చినప్పుడు చెలరేగిపోయే నేతలకు భిన్నంగా కూల్ గా రియాక్ట్ అయిన డీఎస్ తన రాజకీయ పరిపక్వత ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.