Begin typing your search above and press return to search.

ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాల‌దంటున్న రేవంత్ రెడ్డి

By:  Tupaki Desk   |   1 July 2022 11:30 AM GMT
ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాల‌దంటున్న రేవంత్ రెడ్డి
X
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మంచి జోరు మీద ఉన్నారు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో వ‌రుస చేరిక‌ల‌తో కాంగ్రెస్ పార్టీ అంత‌కంత‌కూ బ‌ల‌ప‌డుతుండ‌ట‌మే దీనికి కార‌ణం. ఆయ‌న పీసీసీ ప‌గ్గాలు చేప‌ట్టాక కాంగ్రెస్ పార్టీ న‌వ‌న‌వోన్మేషంతో తొణికస‌లాడుతోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ఎన్నిక‌లు జూలై 18న జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో య‌శ్వంత్ సిన్హా అన్ని రాష్ట్రాల్లో ఆయా పార్టీల అధినేత‌ల‌ను క‌ల‌సి మ‌ద్ద‌తు కోరుతున్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ‌కు వ‌స్తున్నారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను క‌ల‌వ‌నున్నారు. ఆయ‌న‌ను క‌ల‌సి రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో త‌న‌కు ఓటు వేయాల్సిందిగా అభ్య‌ర్థించ‌నున్నారు.

ఈ నేప‌థ్యంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. య‌శ్వంత్ సిన్హాను తాము క‌ల‌వ‌బోమ‌ని తేల్చిచెప్పారు. య‌శ్వంత్ వ‌స్తుంది కేసీఆర్ ను క‌ల‌వ‌డానిక‌ని.. అలాంటప్పుడు తాము య‌శ్వంత్ ను ఎందుకు క‌లుస్తామ‌ని ఎదురుప్ర‌శ్నించారు.

త‌మ‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చి య‌శ్వంత్ కేసీఆర్ ను క‌ల‌సినా లేదా కేసీఆర్ ను క‌ల‌వ‌డానికి వ‌చ్చి త‌మ‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చినా ఆయ‌న‌ను క‌ల‌వ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద‌... ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాల‌ద‌ని తాను గ‌తంలోనే చెప్పాన‌ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

యశ్వంత్‌ సిన్హా కాంగ్రెస్‌ అభ్యర్థి కాదని, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెనర్జీ మద్దతు అడిగితేనే ఇచ్చామన్నారు. ఈ నేప‌థ్యంలో య‌శ్వంత్ ను క‌లిసేది లేద‌ని వెల్ల‌డించారు. మ‌రోవైపు య‌శ్వంత్ హైద‌రాబాద్ వ‌స్తున్న నేప‌థ్యంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆయ‌న‌కు స్వాగతం ప‌ల‌క‌డానికి భారీ ఏర్పాట్లు చేసింది. ప‌ది వేల మంది కార్య‌క‌ర్త‌ల‌తో బైక్ ర్యాలీ నిర్వ‌హించ‌నుంది.

కాగా చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి బీజేపీలో చేర‌డంపైనా రేవంత్ స్పందించారు. ఆయ‌న త‌న‌కు మంచి మిత్రుడ‌ని తెలిపారు. బీజేపీలో చేరుతున్న‌ట్టు విశ్వేశ్వ‌ర్ రెడ్డి త‌న‌కు మాట మాత్రంగా కూడా చెప్ప‌లేద‌న్నారు. అలాంట‌ప్పుడు తాను ఆయ‌న‌పై ఏం స్పందించాల‌ని ప్ర‌శ్నించారు. కానీ బీజేపీలో చేరిన కొద్ది కాలానికే ఆ పార్టీ విధానాలు న‌చ్చ‌క ఆయ‌న వెన‌క్కి తిరిగి వ‌చ్చేస్తార‌నే న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని ఈ సంద‌ర్భంగా రేవంత్ స్ప‌ష్టం చేశారు.