Begin typing your search above and press return to search.

పాత సెక్ర‌టేరియ‌ట్లో నిధులు.. అందుకే ర‌హ‌స్యంగా కూల్చివేత‌లు!

By:  Tupaki Desk   |   14 July 2020 5:31 PM GMT
పాత సెక్ర‌టేరియ‌ట్లో నిధులు.. అందుకే ర‌హ‌స్యంగా కూల్చివేత‌లు!
X
తెలంగాణ స‌చివాల‌యం కూల్చివేతపై రాష్ట్రంలోని అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. పాత స‌చివాల‌యం ఉన్న ప్రాంతంలోనే కొత్త స‌చివాల‌యాన్ని నిర్మించాల‌ని త‌ల‌పెట్టిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్ప‌టికే శంకుస్థాప‌న చేశారు. తన ఆకాంక్ష‌కు అనుగుణంగా పాత స‌చివాల‌యం కూల్చివేత ప‌నులు కూడా వేగంగా సాగిస్తున్నారు. ఈ పరిణామంపై తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స‌చివాల‌యం కూల్చివేత‌పై కోర్టును ఆశ్రయించినప్పటి నుంచి కేసీఆర్ కనిపించకుండా పోయారని, అదే స‌మ‌యంలో స‌చివాల‌యం ప్రాంగ‌ణంలో నేల మాలిగ‌లు ఉన్నాయ‌నే విష‌యంలోనూ అస్ప‌ష్ట‌త కొన‌సాగుతోంద‌ని అన్నారు.

తెలంగాణ స‌చివాల‌యం కూల్చివేత‌పై రేవంత్ రెడ్డి అనేక అనుమానాలు వ్య‌క్తం చేశారు. సచివాలయం చుట్టూ 3 కిలోమీటర్ల మేర ర‌వాణా నిలిపివేసి కూల్చివేతలు చేయ‌డం ఏంట‌ని రేవంత్ ప్ర‌శ్నించారు. పొక్రాన్ అణు పరీక్షలు కూడా ఇంత రహస్యంగా జరపలేదని ఎద్దేవా చేశారు. ఈ నేప‌థ్యంలో తాము అధ్య‌య‌నం చేయ‌గా, నిధి అన్వేషణ జరుగుతుందనే విషయాలు తెలిశాయ‌ని రేవంత్ అన్నారు. గ‌తంలో ఈ మేర‌కు ప‌లు ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌చ్చాయ‌ని రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. స‌చివాల‌య ప‌రిస‌ర ప్రాంగ‌ణాల్లోని మింట్ కాంపౌండ్, విద్యారణ్య స్కూల్ ఆవరణ, హోమ్ సైన్స్ కాలేజ్‌లో గతంలో సొరంగాలు బయటపడ్డాయని రేవంత్ పేర్కొన్నారు. జీ బ్లాక్ కింద నిజాం ఖజానా ఉందనే వార్తలను గతంలో పత్రికలు ప్రచురించాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ నేప‌థ్యంలోనే, సొరంగాల కింద అన్వేషణ కోసం అవకాశం ఇవ్వాలని పురావస్తు శాఖ జీహెచ్ఎంసీకి లేఖ రాసిందని, అయితే అనుమతి ఇవ్వలేద‌ని వెల్ల‌డించారు. పైగా లేఖ రాసిన అధికారిని పదవి నుంచి తొలగించారని కానీ ప్ర‌స్తుతం అక్కడే తవ్వకాలు చేప‌డుతున్నార‌ని ఈ నేప‌థ్యంలో ప‌లు అనుమానాలున్నాయ‌ని పేర్కొన్నారు.