Begin typing your search above and press return to search.

సీఎం నేనే.. సీనియర్లకు మంటుపుట్టిస్తున్న రేవంత్

By:  Tupaki Desk   |   17 March 2023 10:00 PM GMT
సీఎం నేనే.. సీనియర్లకు మంటుపుట్టిస్తున్న రేవంత్
X
నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు పాదయాత్రకు కదిలినప్పుడు కూడా ఇదే పరిస్థితి. అసమ్మతితో కాంగ్రెస్ ను సీనియర్లు భ్రష్టు పట్టించారన్న విమర్శలు ఉన్నాయి. అయితే మొక్కవోని పట్టుదలతో కాంగ్రెస్ ను ఏకతాటిపైకి తీసుకొచ్చి రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు. పార్టీని ఆంధ్రలో గెలిపించి రెండు సార్లు పాలించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అదే పరిస్థితి. మొదట్లో సీనియర్లతో అణుకువగా ఉన్న రేవంత్ రెడ్డి తాజాగా బయటపడుతున్నారు. కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులు అంటూ సీనియర్లపై ఎదురుదాడికి దిగారు.

తన పాదయాత్రకు వస్తున్న అద్భుత స్పందన చూసి రేవంత్ లో ధైర్యం వస్తోంది. అందుకే నియోజకవర్గాల్లో ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్లపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నాడు. కాంగ్రెస్ సీనియర్లు పోతేనే పార్టీ బాగుపడుతుందంటూ డైరెక్ట్ అటాక్ కు రేవంత్ రెడ్డి దిగుతున్నాడు.

కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి పోటీగా నిర్మల్ లో మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి భట్టి విక్రమార్క సైతం పోటీగా యాత్రలు చేపట్టారు. జనస్పందన లేకపోవడం.. వారి చుట్టూ కార్యకర్తలు నేతలు రాకపోవడంతో ఎవరూ పట్టించుకోవడం లేదని వీరిద్దరూ ఆపేశారు.

ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి పాదయాత్రకు జనస్పందన వెల్లువెత్తుతోంది. అందుకే తనకు తానే సీఎంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. పాదయాత్రలో మీడియా ప్రతినిధులతో పరోక్షంగా చెప్పుకుంటున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. తానే సీఎం అన్న విషయాన్ని క్లారిటీగా చెప్పేస్తున్నాడు.

సీఎం కావాలంటే ఎమ్మెల్యేగా గెలవాలి. అందుకే మళ్లీ కొడంగల్ నుంచి పోటీచేయడానికి రేవంత్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిని మళ్లీ పార్టీలో చేర్చుకున్నారు. రెండు సార్లు అక్కడి నుంచి గెలిచినా గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఏ పార్టీకి ఆంధ్ర, తెలంగాణలో మూడు సార్లు అధికారం ప్రజలు ఇవ్వలేదని.. ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందని.. తానే సీఎం అవుతానని రేవంత్ రెడ్డి నమ్మకంగా ఉన్నారు. మరి రేవంత్ ఆశలు నెరవేరుతాయో లేవో చూడాలి. కానీ రేవంత్ మాటలు మాత్రం కాంగ్రెస్ సీనియర్లకు మంటపుట్టించేలా ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.