కేసీఆర్ కు ఫైర్ బ్రాండ్ మరో పంచ్!

Tue Feb 12 2019 22:29:59 GMT+0530 (IST)

Revanth Reddy Comments on KCR

ఇవాల్టి రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శలు చేసే దమ్ము ధైర్యం తెలంగాణలో చాలామంది నేతలకు లేని పరిస్థితి. తొందరపడి ఆయన మీద ఒకమాట అనేందుకు సవాలచ్చ ఆలోచిస్తున్న పరిస్థితి. అదే పనిగా కేసీఆర్ మీద ఘాటు విమర్శలు చేసే తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సైతం కాస్తంత వెనక్కి తగ్గి.. మరి కొద్ది నెలల పాటు తాను నోరు విప్పనంటూ నిర్ణయం తీసుకొని తెర వెనక్కి వెళ్లిపోయారు.రేవంత్ మాత్రమే కాదు.. అదే పనిగా కేసీఆర్ మీద పైర్ అయ్యే పలువురు కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కామ్ అయ్యే పరిస్థితి. ఇలాంటివేళ.. కేసీఆర్ ను విమర్శించేదెవరన్న ప్రశ్నకు నేనున్నానంటూ.. ట్వీట్లతో పంచ్ ల మీద పంచ్ లు ఇస్తున్నారు రాములమ్మ అలియాస్ విజయశాంతి.

ఇటీవల కాలంలో ఏపీకి సంబంధించిన అంశాలతో పాటు.. మరికొన్ని అంశాల మీద ఆమె కేసీఆర్ తీరును తప్పు పడుతున్నారు. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ చంద్రబాబు చేసిన దీక్ష నేపథ్యంలో ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ తీరును ఆమె తప్పు పట్టారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ ను కాంగ్రెస్ తో సహా దేశంలోని పలు ప్రధాన రాజకీయ పార్టీలు సమర్థించాయని.. దానిపై సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆమె.. కేసీఆర్ కామ్ గా ఉన్నారంటూ తప్పు పట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం దేశాన్ని కదిలించే దీక్షకు మద్దతు తెలపని టీఆర్ ఎస్ అధినేత.. విజయవాడకు వెళ్లి అక్కడి ప్రజల అభిమానం చూరగొనాలని అనుకోవటం ఏమిటంటూ క్వశ్చన్ వేశారు.

లాజిక్ గా చూస్తే.. రాములమ్మ వ్యాఖ్యలో ధర్మముందని చెప్పాలి. బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు బెజవాడ వెళతానన్నారే కానీ.. ఏపీ ప్రజల మీద అభిమానంతోనో.. ప్రేమతోనో కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇంతకీ.. కేసీఆర్ కు పంచ్ వేస్తూ రాములమ్మ పెట్టిన పోస్ట్ ను యథాతధంగా చూస్తే..

 ‘‘ఢిల్లీ వేదికగా జరిగిన నిరసన దీక్ష ద్వారా కాంగ్రెస్ చీఫ్ రాహూల్ గాంధీ గారి నేతృత్వంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడితే తప్ప తెలుగు ప్రజలకు న్యాయం జరగదన్న విషయంపై స్పష్టత వచ్చింది. రాజకీయాలకు అతీతంగా ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీల నేతలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ముక్త కంఠంతో నినదించారు. కానీ పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదాకు మద్దతిస్తామని ప్రకటించిన కేసీఆర్‌గారి నేతృత్వంలోని టీఆర్ ఎస్ పార్టీ నామమాత్రంగానైనా ఈ విషయంపై ప్రకటన చేయలేదు. కేసీఆర్ గారికి తెలుగు ప్రజల ఆకాంక్షల కంటే - మోదీ ప్రాపకం మాత్రమే ముఖ్యమన్న విషయం దీని ద్వారా మరోసారి స్పష్టమైంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం దేశాన్ని కదిలించే రీతిలో జరిగిన దీక్షకు మద్దతు తెలపలేని టీఆర్ ఎస్ అధినేత - విజయవాడకు వెళ్లి అక్కడి ప్రజల అభిమానం చూరగొందామని కలలు కంటున్నారు. ఇలాంటి అవకాశవాద రాజకీయం చేసే నేతలనే కాదు వారిని చేరదీసే వారినీ ఎక్కడ ఉంచాలో ఏపీ ప్రజలకు బాగా తెలుసు’’