Begin typing your search above and press return to search.

వడ్డీ రేట్లు యధాతథం .. ఆర్బీఐ సంచలనం నిర్ణయం !

By:  Tupaki Desk   |   6 Aug 2020 5:30 PM GMT
వడ్డీ రేట్లు యధాతథం ..  ఆర్బీఐ సంచలనం నిర్ణయం !
X
రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ భేటీ జరిగింది. మంగళవారం నుండి గురువారం వరకు కమిటీ పలు అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా ఆర్బీఐ కమిటీ తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ నేడు మీడియాకు వెల్లడించారు. రెపో రేటు 4 శాతం, రివ‌ర్స్ రెపో రేటును 3.3 శాతంగానే ఉంచుతున్నట్టు ఆయన వెల్లడించారు. బ్యాంకులకు ఇచ్చే రుణాల నుంచి ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటును రెపోరేటు అని.. బ్యాంకులకు ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటును రివర్స్ రెపోరేటు అని అంటారు. అందులో ఎటువంటి మార్పు లేదని వెల్లడించారు.

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. అయితే, ఫైనాన్షియల్ మార్కెట్లు పుంజుకుంటున్నట్టు ప్రకటించారు. మంచి వర్షాలు, ఖరీఫ్ విత్తనాల విస్తీర్ణంతో వ్యవసాయ రంగ అవకాశాలు మెరుగుపడినట్లు చెప్పారు. బ్యాంకు రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును యథాతథంగా ఉంచింది ఆర్బీఐ. వీటి రేటు 4.25 శాతంగా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌ లో ద్రవ్యోల్భణం పెరిగే అవకాశముందని చెప్పారు. అవసరమైతే తగిన సందర్భంలో మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆర్ ‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పేర్కొన్నారు. అయితే రెండో అర్ధ సంవత్సరంలో కోలుకుంటుంది అని తెలిపారు.

ఈ సారి వడ్డీరేట్లను ఆర్బీఐ కనీసం 25 బేస్ పాయింట్లు తగ్గిస్తుందని వ్యాపార వర్గాలు ఆశించాయి. నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్‌ హెచ్‌ బీ), నాబార్డ్‌ల (జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు) ద్వారా అదనంగా మరో రూ.10 వేల కోట్ల మేర నగదు లభ్యతను అందుబాటులోకి తెస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. మరోవైపు పడిపోతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు అమెరికాలో వడ్డీ రేట్లు దాదాపు జీరోకు చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన వద్ద కూడా వడ్డీ రేట్లను మరింతగా తగ్గించే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ కొనసాగింది. ఇప్పటికే భారీగా తగ్గాయి. మరింతగా తగ్గిస్తే బ్యాంకింగ్ వ్యవస్థపై పడే ప్రభావాన్ని కూడా నిపుణులు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం రెపో తగ్గింపు రేటు సరికాదని అధికారులు భావించారు.