Begin typing your search above and press return to search.

సైకిల్ న‌డిపిన బాలిక ఇంటికి బారులుతీరుతున్న సంస్థ‌లు

By:  Tupaki Desk   |   31 May 2020 12:30 AM GMT
సైకిల్ న‌డిపిన బాలిక ఇంటికి బారులుతీరుతున్న సంస్థ‌లు
X
లాక్‌డౌన్ వేళ ఎలాంటి ర‌వాణా సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకుని వేల కిలోమీట‌ర్లు న‌డిపించి తీసుకెళ్లిన బాలిక కుటుంబానికి ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌లు స‌హకారం అందిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఆ బాలిక కుటుంబం ఇంటికి టెంట్ వేసి మ‌రి ప‌లు సంస్థ‌లు, ప్ర‌ముఖులు స‌హాయం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ పాపే జ్యోతికుమారి. లాక్‌డౌన్ ఉండ‌డంతో ప్ర‌జా ర‌వాణా లేక ఢిల్లీలోని గుర్గావ్ నుంచి బీహార్‌లోని సిరిహులి వ‌ర‌కు త‌న తండ్రిని సైకిల్ మీద కూర్చోబెట్టి తొక్కుకుంటూ వెళ్లింది. ఏకంగా 1200 కిలోమీట‌ర్ల దూరం సాహ‌స యాత్ర చేసిన విష‌యం తెలిసిందే.

మీడియా, సోష‌ల్ మీడియాలో వార్త‌లు ఆమెపై భారీగా వ‌చ్చాయి. ఆమె గురించి ఏకంగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కూడా స్పందించి అభినందించింది. వారి క‌ష్టం చూసి ఆ కుటుంబానికి సాయం చేయ‌డానికి ప‌లు సంస్థ‌లు ముందుకొచ్చాయి. ఈ క్ర‌మంలోనే భార‌త సైక్లింగ్ స‌మాఖ్య ఆమెకు శిక్ష‌ణ ఇస్తామ‌ని కూడా ప్ర‌క‌టించింది.

ఈ క్ర‌మంలో రోజు జ్యోతిని చూడ‌టానికి రోజూ పెద్ద సంఖ్య‌లో వివిధ సంస్థ‌ల ప్ర‌తినిధులు, ప్ర‌జ‌లు వ‌స్తున్నారు. ముందే వారి‌ది చిన్నఇల్లు కావ‌డం, వైర‌స్ భ‌యం ఉండడంటంతో జ్యోతి ఇంటి ప‌క్క‌నే ఒక టెంట్ వేసి వ‌చ్చిన వారంద‌రినీ క‌లుస్తోంది. తన తల్లికి ఇచ్చిన మాట కోసం తన తండ్రిని అంత దూరం నుంచి ఇంటికి తీసుకొచ్చానని జ్యోతి చెబుతోంది. లాక్‌డౌన్‌తో త‌న‌లాంటి వాళ్లు ఎంతోమంది పరిస్థితి ఇలాగే ఉందని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

త‌మ‌ ఇల్లు చాలా చిన్న‌దని, అందుకే ప‌క్క‌నే చిన్న టెంట్ వేశామ‌ని జ్యోతి తండ్రి మోహ‌న్ పాశ్వాన్ తెలిపారు. వ‌చ్చిపోయే వాళ్ల వ‌ల్ల వైర‌స్‌ సోకుతుందనే భ‌యం ఉందని, ఎవ‌రినైనా రావొద్దంటే త‌మ‌కు గ‌ర్వం వ‌చ్చింద‌ని భావిస్తార‌నే అలాంటి ఏర్పాట్లు చేసిన‌ట్లు వివ‌రించారు. అందుకే ప‌క్క‌న ఓ టెంట్ వేయ‌డంతో అంద‌రూ అక్క‌డికి వ‌చ్చి మా అమ్మాయిని ఆశీర్వ‌దించి వెళ్తున్న‌ట్లు తెలిపాడు. చాలామంది త‌మ‌కు స‌హాయం చేయ‌డానికి ముందుకు వ‌స్తున్నార‌ని వారికి కృత‌జ్ఞ‌త‌లు అని చెప్పారు.