Begin typing your search above and press return to search.

మలివిడతకు మార్కుల్లేవు : వైసీపీ గ్రాఫ్ జారడానికి అదే రీజన్..?

By:  Tupaki Desk   |   28 Jun 2022 9:30 AM GMT
మలివిడతకు మార్కుల్లేవు : వైసీపీ గ్రాఫ్ జారడానికి అదే రీజన్..?
X
ఎంతో కసరత్తు చేసి మరీ ఏప్రిల్ 11న జగన్ తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. దానికి ముందు జరిగిన తంతు ఎంతో ఆసక్తిని రేపింది. టోటల్ గా మంత్రులను మార్చేసి పాతికకు పాతికా కొత్త ముఖాలనే జగన్ తీసుకుంటారు అని అంతా ప్రచారం సాగింది. అయితే చివరికి పదకొండు మంది పాత మంత్రులను కొనసాగిస్తూ కొత్తగా పద్నాలుగు మంది మంత్రులకు చోటిచ్చారు.

ఒక విధంగా దాన్ని ఎన్నికల టీమ్ అని పేరు పెట్టి కూడా చెప్పుకున్నారు. కొత్త మంత్రివర్గం కొలువు తీరు దాదాపుగా మూడు నెలలకు దగ్గర పడుతోంది. మరి మలివిడతకు జనాలలోనూ రాజకీయ వర్గాలలోనూ మార్కులు ఎన్ని పడ్డాయీ అంటే పూర్తి నిరాశ కలుగుతోందిట. మలివిడతలో సామాజిక తూకాలు పాటించారు. విద్యాధికులను తీసుకున్నారు. మహిళకకు పెద్ద పీట వేశారు.

అంతా రేసు గుర్రాలే కనుక ఇక దూసుకుపోవడం ఖాయమని అనుకున్నారు. కానీ చిత్రంగా మంత్రివర్గ విస్తరణకు ముందు వైసీపీ గ్రాఫ్ ఒకలా ఉంటే ఆ తరువాత పెద్ద ఎత్తున దిగజారడం కనిపించింది అని విశ్లేషణలు ఉన్నాయి. దానికి కారణం మూడు నెలలలోనే వైసీపీ మీద కట్టకట్టుకుని ప్రజా వ్యతిరేకత వచ్చిందని కాదు. ప్రభుత్వం అన్నది అచేతంగా అయిపోవడం వల్ల వచ్చిన భారీ మార్పుగా దీనిని చూస్తున్నారు. ప్రభుత్వం ఈ మూడు నెలలలో పనిచేసిందా అన్న చర్చ కూడా బయల్దేరింది.

నిజానికి ప్రభుత్వం పనిచేస్తోంది అనడానికి తార్కాణం ఏంటి అంటే మంత్రులు చురుకుగా ఉండడం, వారు బయటకు వచ్చి మాట్లాడడం, వారు నిత్యం మీడియాతో ఉండడం, అలా సర్కార్ చేతనత్వం అన్నది తేటతెల్లమవుతుంది. అదే టైమ్ లో విపక్షాలు కనుక ఒక మాట అంటే దానికి ధీటుగా ఎదుర్కొని తాము ఏం చేస్తున్నామో నిజాయతీగా చెప్పి సమర్ధించుకోవడం. అలా సర్కార్ గురించి నిరంతరం జనంలో చర్చ జరిగేలా చూసుకోవడం. జనంలోని ప్లస్ పాయింట్స్ ఎక్కువగా వెళ్లేలా చేసుకుని మైనస్ పాయింట్లు ఏమైనా ఉన్నా విపక్షాలు వాటిని జొప్పిస్తున్నా అవి జనం మెదళ్ళకు చేరకుండా ఎక్కడికక్కడ కట్టడి చేయడం.

ఇది చాలా పెద్ద మెకానిజం. ఈ విషయంలో గత కాంగ్రెస్ సర్కార్ ల కంటే కూడా తెలుగుదేశమే ఎపుడూ బెటర్ గా ఉంటూ వచ్చింది. ఇక 2019లో ఏర్పడిన జగన్ సర్కార్ లోని తొలి విడత మంత్రివర్గం మొదట్లో తడబాటు పడినా కూడా ఆ తరువాత మాత్రం సర్దుకుని దూకుడు చేసింది. నాడు నోరున్న మంత్రులు దాదాపుగా అరడజనుకు పైగా ఉండేవారు. కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు వంటి వారు అయితే ముందు వరస‌లో ఉంటూ టీడీపీకి కౌంటర్లు ఎప్పటికపుడు ఇచ్చేవారు.

ఇక మలివిడత మంత్రులలో అంబటి రాంబాబు, గుడివాడ అమరనాధ్, జోగి రమేష్, రోజా వంటి వారు కూడా అపుడపుడు తప్ప అనుకున్నట్లుగా స్పందించడంలేదు అన్న విమర్శలు ఉన్నాయి. మిగిలిన మంత్రులు అంతా ఫుల్ సైలెంట్ మోడ్ లో ఉంటున్నారు. మంత్రులు అంటే పదమూడు జిల్లలకు బాధ్యులు. తమ శాఖలకు సంబంధించి వారు పూర్తిగా స్టడీ చేసి మీడియా ముందుకు రావాలి. కానీ కొత్త మంత్రులు అంతా కూడా నియోజకవర్గాలకే అతుక్కుపోయారు అన్న విమర్శలు ఉన్నాయి.

ఇక మలివిడత మంత్రివర్గ విస్తరణతో వైసీపీలోని అసంతృప్తులు అలకలు బట్టబయలు అయ్యాయి. మరో వైపు కొత్త మంత్రులు పెద్దగా సౌండ్ ఇవ్వడంలేదు. దాంతో ఇదే అదనుగా విపక్షం బాగా చెలరేగిపోయింది. బాదుడే బాదుడు అంటూ కరెక్ట్ టైమ్ లో చంద్రబాబు స్టార్ట్ చేసి జనాల వద్దకు వెళ్లి ఆదరణ దక్కించుకున్నారు. అలాగే మహానాడు సూపర్ హిట్ అయింది. ఇపుడు ఆయన జిల్లాల టూర్లు పెట్టుకున్నారు.

ఇంకో వైపు జనసేనాని పవన్ కూడా దూకుడు పెంచేశారు. ఆయన సభలకు జనాలు బాగా వస్తున్నారు. మాటలలో పదును పెరిగింది. ఈ పరిణామాలతో వార్ వన్ సైడ్ అన్నట్లుగా విపక్షం వాయిస్ ఏపీలో గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ అసలే మాట్లాడరు, ఇక మంత్రులు కూడా సైలెంట్ అయితే సర్కార్ అచేతనమే అవుతుంది. ప్రస్తుతం దీని వల్లనే వైసీపీ గ్రాఫ్ బాగా పడిపోతోందా అన్న చర్చ అయితే సాగుతోంది.

అయితే కొత్త మంత్రులు ఇంకా సర్దుకునే దశలో ఉన్నారని, దానికి తోడు గడప గడపకు ప్రోగ్రామ్స్, పార్టీ ప్లీనరీలు వంటి బిజీ ఉందని, వైసీపీ ప్లీనరీ తరువాత వారు విజృంభిస్తారు అని అంటున్నారు. కానీ ఏ పార్టీకి అయినా ఒక్కసారి కనుక వెనకబడినా గ్రాఫ్ పడిపోయినా మళ్ళీ దాన్ని అందుకోవడం కష్టమని చరిత్ర చెబుతున్న సత్యం. వైసీపీలో అయితే మలివిడత మంత్రివర్గంతో ఎన్నికలను ఎలా ఎదుర్కొంటా రు అన్న చర్చ అయితే సాగుతోందిట.