Begin typing your search above and press return to search.

అందుకే వెంక‌య్య‌కు ఉప‌రాష్ట్రప‌తి!

By:  Tupaki Desk   |   26 July 2018 8:36 AM GMT
అందుకే వెంక‌య్య‌కు ఉప‌రాష్ట్రప‌తి!
X
ప‌రిణామాల‌న్నీ గ‌మ‌నిస్తే అర్థ‌మ‌య్యేది ఒక్క‌టే.. ఉన్న‌ట్లుండి వెంక‌య్య‌ను ఉప రాష్ట్రప‌తి కుర్చీలో కూర్చోపెట్ట‌టానికి వెనుక చాలానే జ‌రిగిందా? అంటే అవున‌న్న మాట వినిపిస్తోంది. ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా ఏపీకి సంబంధించి ఎంతో కొంత బాధ్య‌త‌ను వెంక‌య్య‌నాయుడు తీసుకున్నాడ‌ని చెప్పాలి. ఒక‌వైపు త‌న‌కు జ‌న్మ‌నిచ్చిన రాష్ట్రం.. మ‌రోవైపు త‌న‌కు రాజ‌కీయంగా జ‌న్మ‌నిచ్చిన పార్టీ.. ఇలా రెండింటిలో ఏదో ఒక‌టి కోరుకోవాలంటే వెంక‌య్య‌లాంటి నేత ఏం చేయ‌గ‌ల‌రు?

విభ‌జ‌న బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశాన్ని తెర మీద‌కు తీసుకురావ‌టం.. నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ చేత క‌మిట్ చేయించ‌టంలో వెంక‌య్య పాత్ర‌ను ఎవ‌రూ కాద‌న‌లేనిది. త్వ‌ర‌లో అధికారంలోకి రానున్న‌ది తామేన‌ని.. త‌ప్ప‌నిస‌రిగా ఏపీకి ఇచ్చే హోదాను ఐదేళ్ల నుంచి ప‌దేళ్ల వ‌ర‌కూ పొడిగిస్తామ‌న్న ధీమాను ప్ర‌ద‌ర్శించారు. వెంక‌య్య ఈ మాట‌లు చెప్పే నాటికి.. మోడీతో త‌న‌కున్న రిలేష‌న్ మీద ఆయ‌న‌కు చాలానే న‌మ్మ‌కం ఉంద‌ని చెప్పాలి. అయితే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎప్పుడైతే బంప‌ర్ మెజార్టీ రావ‌టం.. ప్ర‌భుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకునే బ‌లం పార్టీకి వ‌చ్చేయ‌టంతో స‌మీక‌ర‌ణాల‌న్నీ ఒక్క‌సారిగా మారిపోయాయి.

చికాకులు పెట్టే మిత్ర‌ప‌క్షాల్ని క‌నుసైగ‌తో శాసించే స్థితికి మోడీ అండ్ కో చేరుకున్నారు. త‌న‌కు న‌చ్చిన‌ట్లుగా పాలించే అరుదైన అవ‌కాశం ఆయ‌న‌కు రావ‌టంతో.. మోడీ ప్రాధామ్యాలు మారాయి. దీని ఫ‌లిత‌మే ఏపీకి హోదాకు హ్యాండివ్వ‌టం. ఇలా ఒక్క‌సారే ఇచ్చేస్తే..ఆయ‌న మోడీ కారు క‌దా. అందుకే.. మొద‌ట చంద్ర‌బాబును ముగ్గులోకి లాగి.. ఆయ‌న‌కు ఆశ చూపించి ప్ర‌త్యేక హోదాను కాస్తా ప్ర‌త్యేక ప్యాకేజీ దిశ‌గా అడుగులు వేసేలా చేశారు.

జ‌రుగుతున్న మోసాన్ని గుర్తించ‌టంలో వైఎస్సార్ కాంగ్రెస్ తో పాటు ఏపీ ప్ర‌జ‌లు అర్థం చేసుకొని మోడీకి వ్య‌తిరేకంగా గ‌ళం విప్ప‌టం మొద‌లైంది. అదే స‌మ‌యంలో.. హోదా కోసం త‌మ ప్రాణాల్ని వదులుకున్న ఆంధ్రోళ్లు లేక‌పోలేదు. కానీ.. వారి త్యాగాన్ని రాజ‌కీయ నేత‌లు ప్రస్తావించే విష‌యంలో జ‌రుగుతున్న అన్యాయంతో ఏపీ హోదా విష‌యంలో ప్ర‌జ‌ల క‌మిట్ మెంట్ మిగిలిన వారికి అర్థం కాని ప‌రిస్థితి.

తెలంగాణ సాధ‌న‌కు ఎంత‌మంది ప్రాణార్ప‌ణం చేశార‌న్న మాట‌ను ప్ర‌తి సంద‌ర్భంలోనూ టీఆర్ ఎస్ ప్ర‌స్తావిస్తూ ఉంటుంది. మొన్న‌టికి మొన్న అవిశ్వాస తీర్మానం సంద‌ర్భంగా విభ‌జ‌న చేసిన తీరుపై గ‌ల్లా జ‌య‌దేవ్ మండిపాటు నేప‌థ్యంలో టీఆర్ ఎస్ నేత‌లు త‌మ పిల్ల‌ల ఆత్మ‌త్యాగాల గురించి ప్ర‌స్తావించారు. అయితే.. ప్ర‌త్యేక హోదా కోసం ఏపీ ప్ర‌జ‌లు త‌మ బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డ్డార‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించ‌టాన్ని మ‌ర్చిపోయిన తీరు చూస్తే.. తెలంగాణ నేత‌ల్లో ఉన్న‌ది.. ఆంధ్రా నేత‌ల్లో లేనిదేమిటో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

హోదా సాధ‌న విష‌యంలో మోడీపై ఒత్తిడి తెచ్చేందుకు వెంక‌య్య శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించార‌ని చెబుతారు. మోడీ.. అమిత్ షాల‌ను క‌న్వీన్స్ చేసే విష‌యంలో ఆయ‌న ప్ర‌య‌త్నాలు నీరు కారిపోవ‌ట‌మే కాదు.. ఇదే కొన‌సాగితే.. ఇబ్బంద‌న్న ఉద్దేశంతో పాటు.. వెంక‌య్య స‌భ‌లో ఉంటే..హోదాపై ఆయ‌న మాట‌ను ప్ర‌స్తావించి ఇరుకున పెట్టే వీలుంద‌న్న విష‌యాన్ని మోడీ గ్ర‌హించిన‌ట్లున్నారు. అందుకే ఆయ‌న బాధ్య‌త వ‌హించే స్థానం నుంచి.. ప్ర‌శ్నించ‌లేని స్థానంలో తీసుకెళ్లి కూర్చొబెట్టార‌ని చెప్పాలి. ఉప రాష్ట్రప‌తి ప‌ద‌విలో వెంక‌య్యను కూర్చోబెట్ట‌టం వెనుక ప‌క్కా వ్యూహం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాల విష‌యంలో వెంక‌య్య ఏమీ చేయ‌లేని స్థితిలో ఉన్నారు. చివ‌ర‌కు ఆయ‌న ఎంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లో ఉన్నారంటే.. ఆయ‌న్ను ఎవ‌రూ ప్ర‌శ్నించ‌లేని.. ఆయ‌న‌కు ఆయ‌న స‌మాధానం లేని ప‌రిస్థితుల్లో ఉన్నారు. మోడీనా.. మ‌జాకానా?