తారకరత్నకు గుండెపోటుకు కారణమిదేనా?

Sat Jan 28 2023 09:58:19 GMT+0530 (India Standard Time)

Reason For TarakaRatna Heart Attack

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పం నుంచి జనవరి 27న మొదలయిన సంగతి తెలిసిందే. తొలిరోజు లోకేష్ 8.5 కిలోమీటర్లు నడిచారు. కాగా తొలి రోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చింది. ఆయన గుండె ఎడమ కవాటం 90 శాతం మూసుకుపోయిందని.. దీనివల్లే ఆయన గుండెపోటుకు గుర య్యారని వైద్యులు తెలిపారు.దీంతో తారకరత్న వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయనను  హుటాహుటిన కుప్పంలోని పీఈఎస్ మెడికల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత అర్ధరాత్రి దాటాక తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి కుమార్తె వచ్చాక ఆయనను బెంగళూరులోని ప్రముఖ హార్ట్ ఆస్పత్రి నారాయణ హృదయాలయ ఆస్పత్రికి చేర్చారు. వైద్యులు ఆయనకు చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తారకరత్న కుటుంబం ప్రస్తుతం బెంగళూరులోనే ఉన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఇతర కుటుంబ సభ్యులు నేరుగా బెంగళూరు చేరుకుని తారకరత్నను పరామర్శిస్తారని చెబుతున్నారు.

కాగా నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి తారకరత్న జనవరి 27 ఉదయం కుప్పం లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. దీంతో అభిమానులు భారీగా ఆయనను చుట్టుముట్టి సెల్ఫీల కోసం పోటీపడ్డారు. దీనికితోడు ఎండ కూడా ఎక్కువగా ఉండటంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అలాగే లక్ష్మీపురంలోని మసీదు వద్దకు కూడా లోకేష్ పాటు వెళ్లారు. అయితే అక్కడ కూడా భారీ ఎత్తున చేరిన అభిమానులతో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయనను వ్యక్తిగత భద్రతా సిబ్బంది పక్కకు తీసుకెళ్లి కూర్చోపెట్టారు.

కొంతసేపు విశ్రాంతి తీసకున్నాక పాదయాత్రకు సిద్ధమవుతుండగా మధ్యాహ్నం 12 గంటలకు గుండెపోటు వచ్చింది. దీంతో కింద పడుతుండగా టీడీపీ కార్యకర్తలు ఆయనను పట్టుకున్నారు. వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయన్ని హుటాహుటిన కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ  వైద్యులు సీపీఆర్ చేశారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం పీఈఎస్ వైద్య కళాశాలకు తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన వెంటనే హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో బాలకృష్ణ హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. రాత్రంతా అక్కడే ఉన్నారు.

మరోవైపు తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణకు చంద్రబాబు ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి తెలుసుకున్నారు. బెంగళూరు హృదయాలయ నుంచి ప్రత్యేక వైద్య నిపుణులను కుప్పం రప్పించారు. ప్రత్యేకంగా రెండు అంబులెన్సులను సైతం అక్కడి నుంచే తెప్పించారు. నారాయణ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స సాగుతోంది. పాదయాత్ర ముగిశాక రాత్రి 8.20 గంటలకు లోకేశ్ ఆసుపత్రికి వెళ్లారు.

పీఈఎస్ ఆసుపత్రి వైద్యులతో చర్చించాక బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చిందని ఎడమ కవాటం 90 శాతం మూసుకుపోయిందని వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. రక్తపోటు సాధారణంగా ఉందని తెలిపారు. ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఆ తర్వాత తారకరత్న భార్య ఇతర కుటుంబ సభ్యులతో చర్చించి వారి నిర్ణయం మేరకు ఆయనకు అంబులెన్సులో చికిత్స కొనసాగిస్తూనే బెంగళూరుకు తరలించారు. ఈమేరకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి ఛైర్మన్ దేవిశెట్టిని పీఈసీ ఆసుపత్రి వైద్యులు సంప్రదించారు. దీంతో అక్కడి నుంచి అత్యాధునిక సదుపాయాలున్న ప్రత్యేక అంబులెన్స్ను కుప్పం రప్పించారు. ఆ అంబులెన్స్లోనే ప్రముఖ కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని నందమూరి బాలకృష్ణ దగ్గరుండి పర్యవేక్షించారు.   నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.