Begin typing your search above and press return to search.

చంద్రబాబు పర్యటనకు గంటా దూరం ఎందుకు..అనుమానాలెన్నో?

By:  Tupaki Desk   |   28 Feb 2020 4:08 PM GMT
చంద్రబాబు పర్యటనకు గంటా దూరం ఎందుకు..అనుమానాలెన్నో?
X
మాజీ మంత్రి - టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గురువారం పార్టీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన ఉద్రిక్తంగా మారింది. చంద్రబాబును వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వాహనం పైకి చెప్పులు - కోడిగుడ్లు విసిరి - కదలకుండా అడ్డుకున్నారు. రోజంతా హైడ్రామా అనంతరం పోలీసులు ఆయనను బలవంతంగా హైదరాబాద్ పంపించారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక పార్టీ నాయకులు - కార్యకర్తలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆ ప్రాంతం కీలక నేతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

కానీ విశాఖ.. ఉత్తరాంధ్ర.. ఆ మాటకు వస్తే ఏపీ టీడీపీలో కీలక నేత అయిన గంటా శ్రీనివాసరావు మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధినేత కార్యక్రమానికి ఆయన దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా ఆయన టీడీపీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారనే ప్రచారం ఉంది. మూడు రాజధానులు.. అందులోను విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామన్న జగన్ ప్రభుత్వం నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. పార్టీ లైన్‌ కు భిన్నంగా ఆయన బహిరంగంగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.

ఆయన వైసీపీలో లేదా బీజేపీలో చేరుతారనే ప్రచారం నాటి నుండి సాగుతోంది. ఇప్పుడు ఏకంగా అధినేత పర్యటనకు దూరంగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. గంటా మాత్రం తాను పార్టీలోనే ఉంటానని - ఏ పార్టీలోకి వెళ్లే ఉద్దేశ్యం లేదని చెబుతున్నారు. వైసీపీ లేదా బీజేపీలోకి వెళ్లేందుకు ఆయనకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని - వాటిపై అంతర్గతంగా చర్చ సాగుతుండవచ్చునని - అందుకే వ్యూహాత్మక మౌనం పాటిస్తుండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారైన తర్వాత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు - విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు - ఇతర నేతలు తమ తమ నియోజకవర్గాల్లో ప్రజాచైతన్య యాత్రలు చేపట్టారు. గంటా మాత్రం యాక్టివ్‌ గా కనిపించడం లేదు. విశాఖను పరిపాలనా రాజధాని చేయాలనే వైసీపీ నిర్ణయాన్ని ఆయన స్వాగతిస్తున్నారు. దీనిని టీడీపీ వ్యతిరేకిస్తోంది. చంద్రబాబు తీవ్రంగా ఉద్యమిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు లేదా టీడీపీ ఉద్యమానికి మద్దతు పలికినా లేదా ఆయన పర్యటనలో పాల్గొన్నా.. తన ప్రాంతంలో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించి, గంటా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా లేక వైసీపీ లేదా బీజేపీలోకి వెళ్లేందుకు అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయా అనే అంశంపై అనుమానాలు కలుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఆయనకు గట్టి పట్టు ఉంది. విశాఖను రాజధానిగా వద్దని చెప్పే కీలక ఉద్యమానికి మద్దతు ఇవ్వడం కంటే ప్రస్తుతానికి మౌనంగా ఉండటం బెట్టర్ అని ఆయన భావిస్తుండవచ్చునని కూడా అంటున్నారు.